ఆ ఎమ్మెల్యేలకు సీటు ధీమా
సాక్షి, చెన్నై : పదవులకు రాజీనామా చేసిన పది మంది మాజీ ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే అధినేత్రి జె జయలలిత పెద్ద దిక్కు అయ్యారు. మనస్సు ఓ చోట, తనువు మరో చోటఅన్నట్టుగా నాలుగేళ్లుగా వ్యవహరించిన ఈ మాజీలు, తాజాగా అమ్మ సేవకు పూర్తిగా అంకితం అయ్యారు. గురువారం పది మంది మాజీ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. మళ్లీ తమకు సీటు తప్పని సరి అన్న ధీమాతో అన్నాడీఎంకే గొడుగు నీడన ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు.
2011 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే తరపున పాండియరాజన్ (విరుదునగర్), సి అరుణ్ పాండియన్(పేరావూరని), మై కెల్ రాయప్పన్(రాధాపురం),టి సుందరరాజన్ (మదురై వెస్ట్), తమిళలగన్ (దిట్టకుడి), టి సురేష్‌కుమార్ (సెం గం), శాంతి (సెంథామంగళం), అరుణ్ సుబ్రమణ్యం(తిరుత్తణి)లు పోటీ చేసి అసెంబ్లీమెట్లు ఎక్కారు. వీళ్లంతా గెలిచింది డీఎండీకే ఢంకా చిహ్నం అయినా, కాల క్రమేనా ఆ పార్టీకి రెబ ల్స్‌గా మారారు. డీఎండీకేలో ఉంటూ, అన్నాడీఎంకే పక్ష పాతిగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో గత వారం ఈ ఎనిమిది మంది తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనా మ ఆమోదంతో డీఎండీకే నేత విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేత హోదాను కోల్పోవాల్సి వచ్చింది.
నాలుగేళ్లుగా డీఎండీకే రెబల్స్‌గా అమ్మకు మద్దతుగా నిలుస్తూ వచ్చిన ఈ ఎనిమిది మంది ప్రస్తుతం తమను అన్నాడీఎంకేలోకి పూర్తిగా అంకితం చేసుకున్నారు. అలాగే, పీఎంకే ఆనైకట్టు ఎమ్మెల్యే కలైయరసన్, పుదియ తమిళగం నీల కోటై ఎమ్మెల్యేలు రామస్వామిలు అమ్మ భక్తితో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. ఈ పది మంది తమ భవిష్యత్తు ఇక, అన్నాడీఎంకేతో పయనం సాగించేందుకు నిర్ణయించారు. పూర్తిగా అన్నాడీఎంకేకు అంకితం అయ్యేందుకు సిద్ధమైన ఈ మాజీల్ని అక్కున చేర్చుకునేందుకు సీఎం , అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయించారు. దీంతో ఈ పది మంది గురువారం పోయెస్ గార్డెన్‌కు పరుగులు తీశారు.
మళ్లీ సీటు ధీమా : పది మంది మాజీ ఎమ్మెల్యేలు ఉదయాన్నే పోయెస్ గార్డెన్‌కు పరుగులు తీశారు. అమ్మ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. వీరందర్నీ ఆహ్వానించిన జయలలిత పార్టీ సభ్యత్వ కార్డులను అందజేశారు. కాసేపు జయలలితతో భేటీ అనంతరం బయటకు వచ్చిన మాజీల్లో ఆనందం తాండవం చేసింది. మీడియాతో మాట్లాడుతూ, మళ్లీ సీటు దక్కుతుందన్న ధీమాతో స్పందించారు. శాశ్వత సీఎం జయలలిత సమక్షంలో అన్నాడీఎంకేలో చేరడం మహదానందంగా ఉందని వ్యాఖ్యానించారు. దేవత దర్శనం తమకు దక్కిందని, ప్రజా హృదయ దేవత గొడుగు నీడన పనిచేసే అవకాశం తమకూ వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో పనిచేయడం మహద్భాగ్యం అంటూ పొగడ్తల పన్నీరు చల్లారు. ఇక, మళ్లీ సీటు దక్కుతుందా..? అని మీడియా ప్రశ్నించగా, అమ్మను నమ్మి వచ్చిన తమకు మంచే జరుగుతుందని, అమ్మ కరుణ తమ మీద ఎల్లప్పుడూ ఉంటుందంటూ ముందుకు సాగడం గమనార్హం.