సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ల ముఖ్యమంత్రి అభ్యర్థులు కిరణ్ బేడీ, అరవింద్ కేజ్రీవాల్ పోటీచేస్తున్నృకష్ణానగర్, న్యూఢిల్లీ నియోజకవర్గాలు, కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జి అజయ్ మాకెన్ పోటీచేస్తున్న సదర్‌బజార్‌తో పాటు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పది నియోజవర్గాల్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారనుంది.
కృష్ణానగర్‌లో బీజేపీకి ఆప్‌తో తలనొప్పే :
కిరణ్ బేడీని బీజేపీ బరిలోకి దింపిన ఈ నియోజకవర్గం వాస్తవానికి మొదటినుంచి ఆ పార్టీకి కంచుకోటగా ముద్రపడింది. కేంద్ర మంత్రి హర్షవర్థన్ ఇక్కడ నుంచి ఐదు సార్లు గెలిచారు. ఆయన నియోజకవర్గంలో మొదటినుంచి ఉన్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ పునాదులను మరింత పటిష్టం చేశారు. కిరణ్ బేడీ గెలుపుపై ఎలాంటి అనుమానాలు లేకుండా ఉండేందుకే ఆమెను ఈ సురక్షిత సీటు నుంచి బరిలోకి దింపారని అంటున్నారు. ఈ ఎన్నిక బేడీకి నల్లేరుపై నడకేనని అనుకుంటున్నప్పటికీ ఆప్ అభ్యర్థి ఎస్‌కె బగ్గా ఆమెకు గట్టిపోటీ ఇచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
న్యూఢిల్లీలో హోరాహోరీ:
వీవీఐపీలు, మధ్యతరగతి వాసులు, ప్రభుత్వోద్యోగులు, దళితులు, జుగ్గీవాసులు... దేశరాజధాని ఢిల్లీ జనాభాకు అద్దంపట్టే ఓటరు నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ రెండవ సారి ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగారు. మాజీ మంత్రి కిరణ్ వాలియా కాంగ్రెస్ అభ్యర్థిగా, యువనేత నుపుర్ శర్మ బీజేపీ అభ్యర్థిగా ఆయనకు పోటీ ఇస్తున్నారు.
సదర్‌బజార్‌లో సమరమే:
కాంగ్రెస్ కోటగా ముద్రపడిన సదర్‌బజార్‌నుంచి కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జ్ అజయ్ మాకెన్ పోటీచేస్తున్నారు. ఆయనపై బీజేపీ నుంచి ప్రవీణ్ జైన్, ఆప్ తరఫున సోమ్ దత్ పోటీ చేస్తున్నారు.
గ్రేటర్ కైలాష్‌లో నువ్వానేనా:
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ట ముఖర్జీ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తుండడంతో గ్రేటర్ కైలాష్‌లో ఎన్నిక ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకప్పుడు ఈ నియోజకవర్గం బీజేపీకి కంచుకోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ ఇక్కడ నుంచి గెలిచి రవాణా మంత్రి అయ్యారు. ఈసారి కూడా పోటీ శర్మిష్ట ముఖర్జీ, సౌరభ్ భరద్వాజ్‌ల మధ్యనే ఉండనుంది.
పడ్పట్ గంజ్‌లో హోరాహోరీ:
ఈ నియోజకరవ్గంలో ఎన్నికల పోరు ఆప్ నేత, ఆప్ మాజీ నేతల మధ్య పోరుగా మారింది. ఆప్ నేత మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఇటీవల బీజేపీలో చేరిన ఆప్ మాజీ నేత వినోద్‌కుమార్ బిన్నీ పోటీకి దిగడంతో ఈ నియోజవర్గంలో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో బిన్నీ లక్ష్మీనగర్ నుంచి ఆప్ అభ్యర్థిగా గెలిచారు.
పటేల్‌నగర్‌లో పోటాపోటీ:
దళితులు, మురికివాడలవాసులు అధికంగా నివసించే ఈ రిజర్వ్‌డ్ నియోజవర్గం నుంచి మాజీ కేంద్ర మం్రృ కష్ణతీరథ్‌బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తుండడంతో ఇక్కడి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి ఆప్ అభ్యర్థిగా హజారీలాల్ చౌహాన్ పోటీచేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే రాజేష్ లిలోటియా కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీలో ఉన్నారు.
త్రిలోక్‌పురిలో ‘ఘర్షణ’ రాజకీయం:
గత ఏడాది హిందూ ముస్లింల మధ్య జరిగిన ఘర్షణల కారణంగా ఈ నియోజకవర్గంలో ఎన్నిక ఫలితాలపై అందరి కన్ను పడింది. మత ఘర్షణల నుంచి రాజకీయ ప్రయోజనాన్ని పొందడానికి మూడు పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ఆప్ అభ్యర్థిగా రాజు ధింగన్, బీజేపీ అభ్యర్థిగా కిరణ్ వైద్య, కాంగ్రెస్ అభ్యర్థిగా బ్రహ్మ పాల్ బరిలో ఉన్నారు.
జనక్‌పురిలో మామా అల్లుళ్ల సవాల్:
బీజేపీ దిగ్గజం జగ్‌దీశ్‌ముఖీ పోటీచేస్తున్న ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. వరుసగా ఏడు సార్లు ఈ సీటు నుంచి విజయకేతనం ఎగురవేసిన ముఖీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆయన అల్లుడు సురేష్ శర్మను బరిలోకి దింపడమే ఇందుకు కారణం.
ద్వారకా..ఎవరో ఏలిక:
మాజీ ఎంపీ మహాబల్ మిశ్రా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఈ నియోజకవర్గంలో ఎన్నికల పోటీపై అందృ దష్టి ఉంది. ఆప్ ఇక్కడి నుంచి మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మనువడు , యాపిల్ కంపెనీ మాజీ ఉద్యోగి ఆదర్శ్ శాస్త్రిని నిలబెట్టింది.
ఆప్,బీజేపీల మెట్రో ప్రచారం..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం మెట్రో రైళ్లు ఆప్ , బీజేపీ ప్రచార సాధనాలుగా మారాయి. ఢిల్లీ మెట్రో యెల్లో లైన్, బ్లూలైన్లపై మెట్రో కోచ్‌ల్లో, గోడలపై, స్టేషన్ల బయటా ఈ రెండు పార్టీల పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. ఎక్కువ మందిని ముఖ్యంగా యువతను,గుర్గావ్, నెహ్రూప్లేస్, నోయిడాలో పని చేసే ఐటి ప్రొఫెషనల్స్‌ను ఆకట్టుకోవడానికి మెట్రో రైళ్లను రెండు పార్టీలు ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారం కోసం ఢిల్లీ మెట్రో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు చెరో 30 రైళ్లను కేటాయించగా, కాంగ్రెస్ ఈ విషయమై ఢిల్లీ మెట్రోను ఇంతవరకు సంప్రదించలేదని తెలిసింది. మెట్రో నియమాల ప్రకారం ప్రకటనల స్థలంలో 15 శాతం మాత్రమే రాజకీయ పార్టీలకు కేటాయించవచ్చు. ఈ నియమం ప్రకారం తాము బీజేపీ, ఆప్‌లకు 30 రైళ్ల చొప్పున ప్రచారం కోసం కేటాయించామని డీఎంఆర్‌సీ అధికారి చెప్పారు.
40 మంది ప్రముఖులతో బీజేపీ ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మొత్తం 40 మంది ప్రముఖ పార్టీనేతల సేవలను ఉపయోగించుకోనుంది. ఈ మేరకు 40 మంది స్టార్ ప్రచారకుల జాబితాను ఢిల్లీ ఎన్నికల ముఖ్యకార్యాలయానికి సమర్పించింది. ఈ జాబితాలో ప్రధాని మోదీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, సీనియర్ నేత ఎల్‌కెఅద్వానీ పేర్లతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సుప్రసిద్ధ నటీనటులు, ఎంపీల పేర్లు ఉన్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 60 సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ పటిష్టమైన ప్రచార వ్యూహాన్ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతో నాలుగు ర్యాలీలు జరిపించాలనుకుంటోంది. అత్యధిక నియోజవర్గాలపై ప్రభావం చూసేలా ప్రధాన మంత్రి ర్యాలీలు జరిగే స్థలాలను నిర్ణయిస్తారని పార్టీ నేతలు చెప్పారు. ప్రస్తుతం పార్టీ జిల్లా స్థాయి నేతలతో, కార్యకర్తలతో ప్రచార సభలు నిర్వహిస్తోన్న పార్టీ అధ్యక్షుడు అమిత షా కూడా నగరంలో కొందరు అభ్యర్థుల తరపున ప్రచార సభల్లో పాల్గొననున్నారు.
పది స్థానాల్లో కీలక పోటీ
Published Thu, Jan 22 2015 10:59 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement
Advertisement