నెట్‌లోనూ హోరాహోరీ | Tough figt between arvind kajriwal kiran bedi | Sakshi
Sakshi News home page

నెట్‌లోనూ హోరాహోరీ

Published Wed, Feb 4 2015 1:52 AM | Last Updated on Mon, Aug 20 2018 5:33 PM

నెట్‌లోనూ హోరాహోరీ - Sakshi

నెట్‌లోనూ హోరాహోరీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సోషల్ మీడియాలోనూ పార్టీల పోరాటం
 ఫేస్‌బుక్, ట్విటర్ వెబ్‌సైట్లలో  ఆప్, బీజేపీ, కాంగ్రెస్‌ల ప్రచారం

 
 
 న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు.. రాజధాని వీధుల్లో బహిరంగ సభలతోనే కాదు.. ఇంటర్నెట్‌లోని సోషల్ మీడియాలో కూడా సమాంతరంగా పోరాటం సాగిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారానికి, యువ, సాంకేతిక పరిజ్ఞానం గల ఓటర్లను ఆకర్షించేందుకు సోషల్ మీడియా కొత్త రణరంగంగా మారింది. గణనీయంగా ఉన్న ఈ ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా విభాగాలను ఏర్పాటు చేసుకుని మరీ సమగ్రమైన ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. ఈ మూడు పార్టీలకూ కలిపి ట్విటర్‌లో 26 లక్షల మంది అనుచరులు (ఫాలోయర్లు), ఫేస్‌బుక్‌లో కోటికి పైగా ‘ఇష్టాలు’ ఉన్నాయి. హాష్‌ట్యాగ్‌లు, ట్వీట్లు, వీడియోలు, ఫేస్‌బుక్ పోస్టులతో మూడు పార్టీలూ ఒక దానితో మరొకటి ముమ్మరంగా పోరాటం చేస్తున్నాయి.
 
  ఇంటర్నెట్ పోరాటం ఎలా చేయాలనే దానిపై ప్రతి పార్టీకీ భిన్నమైన వ్యూహం ఉంది.
 ఆప్‌కు 200 మంది వలంటీర్లు: ‘‘పార్టీ సోషల్ మీడియాను నిర్వహించేందుకు మాకు 16 మందితో కేంద్ర బృందం ఉంది. మరో 55 మంది సభ్యులు దేశ, విదేశాల నుంచి పనిచేస్తుంటారు. క్రియాశీలంగా పనిచేసే 200 మంది స్వచ్ఛంద కార్యకర్తలు (వలంటీర్లు) కూడా ఉన్నారు’’ అని ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త అంకిత్‌లాల్ వివరించారు. ఆప్‌కు ఫేస్‌బుక్‌లో 23 లక్షల లైక్‌లు ఉండగా.. ట్విటర్‌లో 11 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.
 
 బీజేపీకి వేయి మంది సైన్యం
 బీజేపీ వేయి మందికి పైగా స్వచ్ఛంద కార్యకర్తల సైన్యంతో తమ పార్టీ నేతల సందేశాలను వివిధ సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేయడానికి కృషి చేస్తోంది. ‘‘వీరిలో అత్యధికులు ఐటీ కంపెనీలు, బీపీఓల్లో పనిచేస్తున్న వారే. ఆన్‌లైన్ ప్రచారం కోసం వారు రెండు వారాలు సెలవు తీసుకుని మరీ తమకు తాముగా కృషి చేస్తున్నారు’’ అని బీజేపీ ఢిల్లీ విభాగం కమ్యూనికేషన్ సెల్ సమన్వయ కర్త ఖేంచంద్‌శర్మ పేర్కొన్నారు. బీజేపీకి ఫేస్‌బుక్‌లో 73 లక్షల లైక్‌లు ఉంటే, ట్విటర్‌లో 12 లక్షల ఫాలోయర్లు ఉన్నారు.
 
 కాంగ్రెస్‌కు 70 మంది వలంటీర్లు: ఇక కాంగ్రెస్ పార్టీ మిగతా రెండు పార్టీలకన్నా సోషల్ మీడియాలోకి ఆలస్యంగా ప్రవేశించినట్లు కనిపిస్తోంది. ఈ పార్టీకి ఫేస్‌బుక్‌లో 35 లక్షల లైక్‌లు, ట్విటర్‌లో 3 లక్షల ఫాలోయర్లు ఉన్నారు. కాంగ్రెస్ ఇంటర్‌నెట్ ప్రచారంలో 12 మంది సభ్యుల బృందం నిరంతరం పనిచేస్తుంటో మరో 70 మంది స్వచ్ఛంద కార్యకర్తలు తమ ఇళ్ల నుంచే రోజుకు ఏడెనిమిది గంటలు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం మొత్తం స్వచ్ఛంద కార్యకర్తల ఆధారంగానే నడుస్తోందని ఢిల్లీ పీసీసీ సోషల్ మీడియా చైర్‌పర్సన్ రాధికాఖేరా పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement