
‘రవాణా’ ఒప్పందం రద్దు
చెన్నై నగరంలోని 25లక్షల జనాభాతోపాటూ ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలతో కార్పొరేషన్ రోడ్లన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి:చెన్నై నగరంలోని 25లక్షల జనాభాతోపాటూ ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే ప్రజలతో కార్పొరేషన్ రోడ్లన్నీ కిటకిటలాడుతూనే ఉంటాయి. నగరం నలుమూలలకే కాదు సిటీ శివార్లకు సైతం బస్సు సౌకర్యం ఉండటం, టికెట్టు చార్జీలు సైతం అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువ మంది బస్సులపైనే ఆధారపడతారు. ఈ కారణంగా బస్టాపులను సైతం ఆకర్షణీయంగా తీర్చిదిద్దడంతో ప్రకటనదారుల కన్నుపడింది. రవాణా సంస్థకు సైతం అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉండడంతో ప్రకటనలపై ప్రయివేటు సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ ఒప్పందంలో అవినీతి, అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో మద్రాసు హైకోర్టు దీన్ని రద్దు చేసింది. దీంతో సదరు రవాణాశాఖ సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, లలిత్ విచారించారు. ప్రకటనల ఒప్పందంలో అవినీతి జరిగినట్లు తెలిసింది. ఈ కారణంగా రవాణాశాఖకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ప్రజాస్వామ్య పరిపాలనలో ఇటువంటి అవినీతి కార్యకలాపాలకు తావులేదని వారు వ్యాఖ్యానించారు.
అత్యంత చాతుర్యంతో సాగిన అవినీతి ఒప్పందాన్ని కొనసాగించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను సర్వసాధారణంగా తీసుకుంటున్నారని రవాణాశాఖ అధికారులపై అక్షింతలు వేశారు. ఈ ఒప్పందంలో పారదర్శకత పాటించకుండా అక్రమమార్గంలో సాగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. తప్పుడు విధానాలతో రవాణాశాఖ తన గౌరవాన్ని తానే కోల్పోతోందని, తన గొయ్యిని తానే తీసుకుంటోందని వారు వ్యాఖ్యానించారు. ఈ ఒప్పందాలు ఏ కోణంలో చూసినా చట్టపరంగా లేవన్నారు. ఈ కారణంగా గతంలో జరిగిన ప్రకటనల ఒప్పందాలను ఎంతమాత్రం కొనసాగించడానికి వీల్లేదని అన్నారు. కొత్తగా టెండర్లు పిలిచి, నిర్ణయాలపై పారదర్శకత, నిజాయితీని పాటించండని హితవు పలికారు. కోర్టులో కేసులు పెట్టిన ప్రకటన సంస్థలు ఒక్కో బస్టాండ్‌కు రూ.5లక్షల చొప్పున రవాణా సంస్థకు చెల్లించాలని ఆదేశించారు. ఈ చెల్లింపు 8 వారాల్లోగా పూర్తి చేయాలని అన్నారు. రవాణాశాఖ సైతం టెండర్ల విధానాన్ని అమలుచేయకుండా ఒక ప్రయివేటు సంస్థకు అప్పగించడం భవిష్యత్లులో సంస్థకు చేటుచేస్తుందని చెప్పారు.