
‘పవన్ కళ్యాణ్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారు’
జనసేన నేత పవన్ కళ్యాణ్ పై రాజ్యసభ సభ్యుడు ఎంపీ టీజీ వెంకటేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కర్నూలు: జనసేన నేత పవన్ కళ్యాణ్ పై రాజ్యసభ సభ్యుడు ఎంపీ టీజీ వెంకటేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ పిచ్చోడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తమిళనాడులో ఇలా మాట్లాడితే ముఖ్యమంత్రి జయలలిత కాళ్లు, చేతులు విరగ్గొట్టించేవారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా సాధించడం గెడ్డం గీసుకున్నంత ఈజీ కాదన్నారు.
చిరంజీవి పదవీకాలం ముగుస్తున్నందునే ఎంపీలు రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై పవన్ ఇన్నిరోజులు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. ఎంపీలు తెలుగులో కాకుండా హిందీలో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అర్థమవుతుందని పవన్ చెప్పడం అనుభవరాహిత్యానికి నిదర్శనమని టీజీ వెంకటేశ్ అన్నారు.