
చదివింపులే!
- మొదలైన బడి ‘మోత’ ..
- ఏటా పెరుగుతున్న డొనేషన్ల భారం
- అదే బాటలో యూనిఫాం, పుస్తకాలు
- నేటి నుంచి ప్రారంభం కానున్న ప్రభుత్వ పాఠశాలలు
- వారం, పది రోజుల క్రితమే ప్రారంభమైన ‘ప్రైవేటు’ స్కూల్స్
సాక్షి, బెంగళూరు : రానురాను చదువు భారమవుతోంది. దీంతో కుటుంబ బడ్జెట్‌లో ఎక్కువ భాగం పిల్లల చదువు కోసం ఖర్చుపెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాష్ర్టంలో ప్రభుత్వ పాఠశాలలు శుక్రవారం నుంచి ప్రారంభం కానుండగా.. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రమే అప్పుడే ప్రారంభమయ్యాయి.
వేలకు వేలు డొనేషన్‌లను కట్టడంతో ఈ విద్యా సంవత్సరాన్ని తల్లిదండ్రుల ప్రారంభిస్తారు. స్కూలు బ్యాగు, యూనిఫాం, కొత్త పుస్తకాలు తదితర అదనపు ఖర్చులు సంవత్సరం పొడవునా వస్తూనే ఉంటాయి. ప్రతి సంవత్సరం వీటి ధరలు పెరగడమే తప్ప తగ్గే పరిస్థితులు కన్పించడం లేదు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో మధ్యతరగతి కుటుంబాల వారు తమ సంపాదనలో సుమారు 30 నుంచి 40 శాతం పిల్లల చదువులకే ఖర్చు పెట్టాల్సి వస్తోంది.
పెన్సిల్ కొనమనో... పెన్ను పోయిందనో... పుస్తకాలు చిరిగిపోయాయనో... బ్యాగ్ పాడైందనో పిల్లల నుంచి నిత్యం అందే ఫిర్యాదులతో తల్లిదండ్రుల జేబుకు పడే చిల్లు దీనికి అదనం. ఇంగ్లీష్ మీడియం పాఠశాలలపై తల్లిదండ్రులు ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. ఈ మక్కువను సొమ్ము చేసుకోవడానికి ఈ పాఠశాలల యాజమాన్యాలు ప్రతి సంవత్సరం ఫీజులను భారీగా పెంచేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అందిన కాడికి దోచేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
రూ.500 కోట్లు జేబుకు చిల్లు
బృహత్ బెంగళూరు మహానగర పాలికే పరిధిలో 620 ప్రైవేటు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డొనేషన్ కాక ఫీజులు, పుస్తకాలు, యూనిఫాం తదితర అవసరాల కోసం ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులు ఒక్కొక్కరికి ప్రారంభంలో కనీసం రూ.25 వేలు ఖర్చవుతోంది. ఈ విధంగా చూస్తే విద్యార్థుల తల్లిదండ్రులు రాబోయే జూన్‌లో దాదాపు రూ.500 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కాన్సెప్ట్, టెక్నో వంటి హై ఎండ్ పాఠశాలల్లో వివిధ సదుపాయాల పేరుతో రెట్టింపు ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో ఒక్కొక్క విద్యార్థికి రూ.25 వేలకు అదనంగా మరో రూ.15 వేలు వరకూ చెల్లించాల్సిందే.
పెరిగిన పుస్తకాల ధరలు..
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నోట్ పుస్తకాల ధర 15 శాతం పెరిగినట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. గత ఏడాది 195 పేజీలు ఉండే నోట్ పుస్తకం రూ.45 ఉండగా... ప్రస్తుతం ఆ ధర రూ.57కి చేరుకుంది. ఇదిలా ఉండగా గత ఏడాది మార్కెట్‌లో కొంతమంది వ్యాపారులు పాఠ్యపుస్తకాలకు కృత్రిమ కొరత సృష్టించి అందిన కాడికి దోచుకున్న సంఘటనలు వెలుగు చూశాయి. ఈసారైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థి తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.