ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫాం పంపిణీ ప్రతియేటా ప్రహసనంగా మారుతోంది. పాఠశాలలు తెరిచిన రోజునే పాఠ్య పుస్తకాలు, యూనిఫాం అందజేస్తామని పదే పదే ప్రకటనలు గుప్పిస్తున్న ప్రభుత్వాధినేతల మాటలు నీటి మూటలవుతున్నాయి. ఏటా రెండు జతల యూనిఫాం ఉచితంగా ఇస్తామని విద్యా పక్షోత్సవాల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరిస్తున్నారు. ఫలితంగా గత ఏడాది తొడిగిన దుస్తులనే విద్యార్థులు మళ్లీ వేసుకుని పాఠశాలలకు వెళుతున్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 2,72,264 మంది విద్యార్థులకు రెండు జతల యూనిఫాం పంపిణీ చేసేందుకు రాజీవ్ విద్యామిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఒక్కో విద్యార్థికి క్లాత్ కొనుగోలుకు జతకు రూ.160, కుట్టుకూలికి రూ.40 కలిపి రెండు జతలకు రూ.400 చొప్పున జిల్లాకు కేటాయించిన రూ.10.89 కోట్ల నిధులను పాఠశాల యాజమాన్య కమిటీల (ఎస్‌ఎంసీ) బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నెల రోజుల కిందట జమ చేసింది. పాఠశాలలు తెరిచిన ఆరు నెలల తరువాత తీరిగ్గా మేల్కొన్న ప్రభుత్వం నిధులు విడుదల చేసి చేతులు దులుపుకుంది. కాగా 2.72 లక్షల మంది విద్యార్థులకు అవసరమయ్యే క్లాత్ సరఫరా బాధ్యతను ప్రభుత్వం ఆప్కోకు అప్పగించింది. దీంతో సగం నిధులను ఎస్‌ఎంసీలు ఆప్కోకు చెల్లించాయి.
10 మండలాలకే క్లాత్ సరఫరా
విద్యార్థులకు యూనిఫాం ఆర్డర్ పొందిన ఆప్కో ఇప్పటికి 10 మండలాలకే క్లాత్ సరఫరా చేసింది. క్లాత్ అందుకున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు యూనిఫాం కుట్టించి ఇచ్చేందుకు టైలర్ల వద్దకు పంపారు. మిగిలిన 47 మండలాలకు క్లాత్ పూర్తి స్థాయిలో చేరేందుకు మరో నెలరోజులకు పైగా సమయం పట్టే అవకాశముంది. దీంతో విద్యాసంవత్సరం చివర్లో గానీ విద్యార్థులకు కొత్త యూనిఫాం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఏ విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు అదే విద్యా సంవత్సరంలో యూనిఫాం అందించేందుకు ముందస్తు ప్రణాళిక వేసుకున్న ప్రభుత్వం దానిని అమలు పర్చడంలో విఫలమైంది. ఫలితంగా ఆలస్యంగా విడుదల చేసిన నిధులు లక్ష్యాన్ని చేరలేకపోతున్నాయి.
నెల రోజుల్లోగా పూర్తిస్థాయిలో సరఫరా
విద్యార్థులకు యూనిఫాం కుట్టించి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎస్‌ఎంసీల ఖాతాల్లోకే నేరుగా నిధులు జమ చేసింది. ఆయా నిధులతో క్లాత్ కొనుగోలుకు ఆప్కోకు ఆర్డర్ ఇచ్చి, వచ్చిన క్లాత్‌ను 10 మండలాలకు చేరవేశాం. మరో నెల రోజుల వ్యవధిలో మిగిలిన మండలాలకు పూర్తిస్థాయిలో క్లాత్ అందుతుంది. గతంలో కంటే ప్రస్తుత విద్యాసంవత్సరంలోనే యూనిఫాం కొనుగోలుపై వేగంగా నిర్ణయం తీసుకున్నాం.
- బి. రాజకుమారి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి, రాజీవ్ విద్యామిషన్
యూనిఫాం ఎక్కడ ?
Published Thu, Jan 9 2014 2:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement