రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం పెద్ద విషయం కాకున్నా, జయను పదవీచ్యుతురాలిని చేసిన శ్రీరంగం కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి :రాష్ట్రంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరగడం పెద్ద విషయం కాకున్నా, జయను పదవీచ్యుతురాలిని చేసిన శ్రీరంగం కావడంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు కోర్టు జయకు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. రెండేళ్లకు మించి జైలు శిక్ష పడిన కారణంగా 1951 సెక్షన్ 8 ప్రకారం జయ తన శాసనసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటిస్తే గానీ శ్రీరంగం స్థానం ఖాళీ అయినట్లుగా ఈసీ పరిగణించదు. బెంగళూరు కోర్టు నుంచి జయ శిక్షకు సంబంధించిన నకలు పత్రాలు రావడంలో జాప్యం చోటుచేసుకుంది.
శ్రీరంగంలో ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలు తహతహలాడుతూ ఈసీపై ఒత్తిడి పెంచాయి. జయలలిత జైలు శిక్ష కోర్టు పత్రాల పరిశీలనను అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ పూర్తిచేశారు. సాంకేతికంగా నిర్ధారించుకున్న తరువాత ఈనెల 8వ తేదీన శ్రీరంగం స్థానం ఖాళీ అయినట్లు అధికారికంగా ప్రకటించారు. నిర్ధారణ పత్రాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు పంపగా, వారి ద్వారా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్‌కు చేరడం కూడా పూర్తయింది.
చర్యలు చేపట్టిన ఈసీ: అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక జరిపించాలని ఈసీ నిబంధన ఉంది. అయితే రాష్ట్రంలో ఓటర్ల జాబితా పనులు సాగుతున్నాయి. కొత్త ఓటర్ల చేరిక, ఇటీవలే పంపిణీ చేసిన కలర్ గుర్తింపు కార్డుల్లో తప్పుల సవరణ వంటి చర్యల్లో ఈసీ తలమునకలై ఉంది. సవరింపులు పూర్తయి జనవరి 5వ తేదీన ఓటర్ల తుదిజాబితాను ప్రకటించనున్నారు. ఆరునెలల్లోగా ఉప ఎన్నిక అంటే మార్చి 27వ తేదీకి గడువు పూర్తికానుంది. ఓటర్ల తుది జాబితా సిద్ధమైన తరువాతనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలా ఈసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తమిళులు ఎక్కువగా సంబరాలు జరుపుకునే జనవరి పొంగల్ పండుగ నాటికి ఉప ఎన్నికల కోలాహలంలో శ్రీరంగం మునిగి తేలే అవకాశం ఉంది.
ప్రతిపక్షాలకు ప్రతిష్టాత్మకం: సెలబ్రెటీలు వాడి వదిలేసిన వస్తువులకు వచ్చే గిరాకీ, మోజు వంటిదే తిరుచిరాపల్లి జిల్లా శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ఏర్పడింది. జయలలితను మాజీ ముఖ్యమంత్రిని చేసిన నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి ప్రతిపక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అన్నాడీఎంకే సైతం సహజంగానే శ్రీరంగం చేజారిపోకుండా కాపాడుకోవాలన్న పట్టుదలతో ఉంది.
ఎన్నికల సమయంలో తమిళనాడు ప్రజలకు ఇచ్చిన హామీలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా శ్రీరంగంను ఎగరేసుకుపోవాలని భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమవుతోంది. రాష్ట్రంలో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్షాలకు విజయం ఆమడదూరంలో ఉండిపోయింది. ఉప ఎన్నిక, పార్లమెంటు ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు అన్నింటా అన్నాడీఎంకేదే విజయకేతనంగా మారిపోయింది. అమ్మధాటికి తట్టుకోలేక నీరసించిపోయిన ప్రతిపక్షాలు వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఉప ఎన్నిక ద్వారా ఊపిరి పోసుకోవాలని ఆశపడుతున్నాయి.