కేసు ఓడితే.. సీఎం పదవి గోవిందా!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బెంగళూరుకు బయల్దేరారు. ప్రత్యేక కోర్టులో నేడు వెలువడనున్న తీర్పు వినేందుకు ఆమె చెన్నై నుంచి బెంగళూరు వెళ్లారు. జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ కూడా బెంగళూరుకు బయల్దేరారు. ముఖ్యమంత్రిగా ఉండగా ఆమె 66 కోట్ల రూపాయల అక్రమాస్తులు పోగేసుకున్నారంటూ ఎప్పుడో 18 ఏళ్ల క్రితం నమోదైన కేసు విచారణ సుదీర్ఘంగా ఇన్నాళ్ల పాటు సాగింది. ఈ కేసులో తీర్పును వెలువరించకుండా చూడాలంటూ జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. దాంతో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు శనివారమే తన తీర్పు ఇవ్వనుంది.
ఒకవేళ ఈ కేసులో తీర్పు జయలలితకు వ్యతిరేకంగా వస్తే మాత్రం ఆమె తన ముఖ్యమంత్రి పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. అలా జరిగితే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనే విషయం కూడా ఇప్పటికే చర్చించుకున్నారు. జయలలిత దృష్టిలో ముగ్గురు ఉన్నారని అన్నాడీఎంకే వర్గాల సమాచారం. వారు రాష్ట్ర రవాణా మంత్రి సెంథిల్ బాలాజీ, రెవెన్యూ మంత్రి పన్నీర్ సెల్వం, మాజీ ఐఏఎస్ అధికారిణి షీలా బాలకృష్ణన్. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవలే రిటైరైన షీలాకు పరిపాలనా అనుభవం ఉంది. ఆమె జయకు అత్యంత నమ్మకస్తురాలు. అందుకే రిటైరైన తర్వాత కూడా ప్రత్యేక సలహాదారుగా ఆమెను నియమించుకున్నారు.