రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు సంవత్సరాంతపు పరీక్షలపై గందరగోళ పరి స్థితి నెలకొంది.
పరీక్షల తేదీల మార్పుపై విద్యాశాఖ తర్జనభర్జన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకటి నుంచి 9వ తరగతి వరకు సంవత్సరాంతపు పరీక్షలపై గందరగోళ పరి స్థితి నెలకొంది. ఒకపక్క ఎమ్మెల్సీ ఎన్నికలు, మరోపక్క పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే సమయంలోనే ఈ షెడ్యూల్ రావడంతో విద్యార్థులు, టీచర్లు అయోమయానికి గురవుతున్నారు. ఈ తరగతుల పరీక్షా విధానంలో గతేడాది తీసుకొచ్చిన కొత్త విధానంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదీ అదే పరిస్థితి.
వేసవి సెలవులకు ముందే పరీక్షలు
గతంలో సంవత్సరాంతపు పరీక్షలు నిర్వ హించి వేసవి సెలవులు ఇచ్చేవారు. ఏప్రిల్ రెండో వారంలో పరీక్షలు మొదలుపెట్టి మూడోవారానికల్లా ముగించేవారు. వెంటనే సెలవులు ప్రకటించేవారు. అలాకాకుండా ముందుగానే పరీక్షలు నిర్వహించి ఫలితా లను విశ్లేషిస్తే.. విద్యార్థులకు ఏ మేరకు అవగాహన ఉందో తెలుస్తుందని, వేసవి సెలవుల్లోపు మళ్లీ తరగతులు నిర్వహించి ఆ లోపాలను సరిదిద్దడానికి వీలుంటుందని అధికారులు అభిప్రాయానికి వచ్చారు. ఆ మేరకు ఏప్రిల్‌లో కాకుండా మార్చి 6వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సంవత్సరాంతపు పరీక్షలు పూర్తి చేయాలని ఈ నెల 7న విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
1 నుంచి 5వ తరగతి విద్యా ర్థులకు మార్చి 15 నుంచి 18 వరకు వార్షిక పరీక్షలు జరపాలని ఆదేశించింది. అయితే రాష్ట్రంలో ఖాళీ అయ్యే ఉపాధ్యాయ, పట్టభద్ర నియోజకవర్గ స్థానాలకు మార్చి 9న ఎన్నికలు జరగనున్నాయి. ఇక మార్చి 17వ తేదీ నుంచి పదో తరగతి పబ్లిక్‌పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఒకేసారి పదో తరగతికి, మిగతా తరగతులకు సంవత్సరాంతపు పరీక్షలు నిర్వహించడం తమకు ఇబ్బందిగా మారుతుందని టీచర్ల వాదన.