విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి
Published Fri, Sep 6 2013 5:53 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
నగరంలో వినాయక చవితి పండుగ ను కోలాహలంగా జరిపేందుకు హిందూ సంఘా లు చర్యలు వేగవంతం చేశాయి. విగ్రహాల ఏర్పాటుకు తప్పని సరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. పదివేల వినాయక విగ్రహాల ప్రతిష్ఠకు వివిధ సంఘాల ప్రతినిధులు, పలువురు వ్యక్తులు పోటీపడుతున్నారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి : హిందువులకు అతిముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. ఈ పండుగను ఈ నెల 9వ తేదీన జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలోని అనేక కూడళ్లలో వినాయకుడి విగ్రహాలు ఏర్పాటుచేసుకోవడానికి వేలాది మంది దరఖాస్తు చేసుకోగా తొలివిడతగా 1705 విగ్రహాలకు అనుమతి మంజూరు చేస్తున్నట్లుపోలీస్ కమిషనర్ కార్యాలయం గురువారం ప్రకటించింది. ఇవేకాక మరో ఐదు వేల చిన్నపాటి విగ్రహాలకు అనుమతి మం జూరైంది. 9వ తేదీన పండుగ ముగిసిన తరువాత 14, 16, 22 తేదీల్లో విగ్రహాలను నిమజ్జనం చేసేం దుకు నిర్వాహకులు అనుమతి కోరుతున్నారు.
ఈ విషయంపై నగర పోలీస్ కమిషనర్ జార్జ్ ఇప్పటికే రెండుసార్లు ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం కార్యక్రమాలపై కొన్ని షరతులు, నిబంధనలు విధించారు. విగ్రహాలు 13 అడుగులకు మించి ఉండరాదని, విగ్రహాలు ప్రతిష్ఠించిన తరువాత నిమజ్జనం చేసే వరకు నిర్వాహకులు రేయింబవళ్లు షిఫ్టు పద్ధతిలో కాపలాగా ఉండాలని, ఊరేగింపు వెళ్లే మార్గాన్ని పోలీసులకు తెలపాలని ఆదేశించారు. అదేవిధంగా విగ్రహాల ఊరేగింపు సమయంలో బాణ సంచా కాల్చరాదని పేర్కొన్నారు. మత ప్రచారం చేస్తూ కరపత్రాలు పంచరాదని నిబంధనలు విధించారు.
తీవ్రవాదుల భయం
రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా తీవ్రవాదుల ఉనికిపై అలజడి నెలకొనడం పోలీసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం ముగిసిన నాటి నుంచి ఇప్పటి వరకు సముద్రతీర ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఇటువంటి ఉత్కంఠ పరిస్థితుల్లో వినాయక చవితి పండుగ రావడం పోలీసులకు సవాల్‌గా మారింది. వినాయక విగ్రహాల నిమజ్జనాలన్నీ అధిక శాతం సముద్రం ఒడ్డునే జరగడం, సముద్ర మార్గం ద్వారా తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో పండుగ ముగిసే వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీస్ యంత్రాంగం నిర్ణయించింది.
Advertisement
Advertisement