కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది | The discovery of the true nature of the | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ నిజ స్వరూపం బయటపడింది

Published Sat, Jan 4 2014 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

The discovery of the true nature of the

= కళంకితులకు మంత్రి పదవులపై 6న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన
 = బీజేపీ ఎస్‌టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప
 
సాక్షి, బళ్లారి : కళంకితులకు మంత్రి పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్ నిజస్వరూపం ఏమిటో బయట పడిందని రాష్ట్ర ఎస్‌టీ మోర్చా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమలింగప్ప అన్నారు. ఆయన శుక్రవారం నగరంలోని  మయూర హోటల్‌లో విలేకరులతో మాట్లాడారు. చెప్పేది శ్రీరంగ నీతులు, చేసేవి తప్పుడు పనులు అన్న చందంగా అక్రమ గనుల తవ్వకాలపై పాదయాత్ర చేసి, తర్వాత అదే అక్రమ గనుల తవ్వకాల ఆరోపణలు ఎదుర్కొంటున్న కళంకితులు డీకే శివకుమార్, రోషన్‌బేగ్‌లకు మంత్రి పదవులు ఇచ్చిన సిద్ధరామయ్య ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

డీకే శివకుమార్, రోషన్ బేగ్‌లకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 6న బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుందన్నారు. బీఎస్‌ఆర్‌సీపీ అధినేత బీ.శ్రీరాములును బీజేపీలోకి త్వరగా వచ్చే విధంగా పార్టీ నాయకులు కృషి చేయాలని, అదే విధంగా బళ్లారి లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుపున శ్రీరాములును పోటీలో పెట్టే విధంగా పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తీసుకు వస్తామన్నారు. బళ్లారి ఎస్‌టీ వర్గాలకు రిజర్వ్ అయినందున శ్రీరాములు బీజేపీ తరుపున సమర్థుడైన అభ్యర్థి అని గుర్తు చేశారు.

 శ్రీరాములు వెంట తామందరం ఉంటామని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందన్నారు. అవినీతి పరులకు మంత్రి పదవులు ఇచ్చి కాంగ్రెస్ తప్పిదం చేస్తోందన్నారు. యడ్యూరప్ప బీజేపీలోకి తిరిగి రానుండటంతో బీజేపీకి కొండంత బలం వస్తుందన్నారు.  కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులు ధరలు అదుపు చేయకపోగా, గ్యాస్ ధరలు కూడా పెంచడం హేయమైన చర్య అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రయ్య, విరుపాక్షిగౌడ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement