కరుణానిధి జన్మదిన వేడుకలకు దూరం
హొసూరు : తమిళనాడులోప్రాంతీయ పార్టీలు తమ నాయకుల జన్మదిన వేడుకలను ప్రచార ఆర్భాటంతో ఘనంగా జరుపుకొని సంతోషపడడం ఆనవాయితీ. అయితే డీఎంకే సీనియర్ నాయకుడు, కురవృద్ధుడు కరుణానిధి 93వ జన్మదిన వేడుకలను జూన్ 3వ తేదీ నిర్వహించాల్సి ఉన్నప్పటికీ క్రిష్ణగిరి పడమర జిల్లా డీఎంకే నేతలు ఎందుకో పట్టించుకోవడం లేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లు అయోమయంలో పడ్డారు.
ముఖ్యంగా డీఎంకే పార్టీ స్టాలిన్, కరుణానిధి వంటి అగ్రనేతల జన్మదినవేడుకల నిర్వహణకు గతంలో జిల్లా కమిటీ సమావేశాలు నిర్వహించి చర్చించడం, ఆ తర్వాత సమితి స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, కార్యకర్తలను, నాయకులను చైతన్యం చేసేవారు. గోడలపై ప్రచారం, రంగు రంగుల ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేసేవారు. 15 రోజులు, ఒక్కొక్క సారి నెలరోజుల ముందుగానే ప్రచారం చేసేవారు. ప్రస్తుతం క్రిష్ణగిరి జిల్లా పడమర డీఎంకే కార్యదర్శి వై.ప్రకాష్ మొక్కుబడిగా జిల్లా కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో ఆ పార్టీలో సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు.
క్రిష్ణగిరి జిల్లాలో పార్టీ అధిష్టాన వర్గం నిర్ణయాలు కూడా అమలు జరపడంలో జిల్లా కమిటీ ఎందుకో మౌనంగానే ఉంది. డీఎంకే పార్టీలో జోడు పదవుల విషయంలో క్రిష్ణగిరి పడమర జిల్లా కార్యదర్శి వై.ప్రకాష్‌కు ఇష్టం లేనట్లుందని విమర్శలు వస్తున్నాయి. హొసూరు మున్సిపాలిటీలోఅనేక మంది డీఎంకే నాయకులు జోడు పదవులపై స్వారీ చేస్తున్నారని, వీరిపై పార్టీ నిర్ణయాన్ని అమలు చేయడం లేదనే వాదన డీఎంకేలోనే బహిరంగంగానే చర్చించుకొంటున్నారు. జిల్లా పార్టీ కార్యదర్శి పదవి, జిల్లా పార్టీ యువజన అధ్యక్ష పదవి ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడంతో పార్టీలో ఇతర సామాజిక వర్గాలు గుసగుసలాడుతున్నాయి.
క్రిష్ణగిరి జిల్లాను తూర్పు, పడమర జిల్లాలుగా విభజించి, ఇద్దరు జిల్లా కార్యదర్శులను నియమించడంతో పార్టీలో విభేదాలు ఎగిసిపడ్డాయి. క్రిష్ణగిరిలో యువత చేతికి పార్టీ పగ్గాలను(వై.ప్రకాష్)కు అందించడంతో సీనియర్లు కొంత అలకలో ఉన్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కరుణానిధి 93వ జన్మదిన వేడుకలను ఘనంగా జరపడానికి నిశ్చయించకపోవడంపై ఆయన అభిమానులు, సీనియర్ డీఎంకే నాయకులలో తీవ్ర అసహనం చోటు చేసుకొందంటున్నారు. ఆ పార్టీలో కొందరు రేపటి తరం స్టాలిన్‌దే, కరుణానిధి అవసరం ఏముంటుందనే ఆలోచనలో పడ్డారా అనే ధోరణిలో అంతా ఉన్నారని ప్రస్తుత నాయకత్వంపై పార్టీలో ఉన్న అసమ్మతివాదులు ఎత్తిచూపుతున్నారు.