ప్రకటనే తరువాయి | The final list of nominated posts | Sakshi
Sakshi News home page

ప్రకటనే తరువాయి

Published Sat, Nov 22 2014 1:45 AM | Last Updated on Wed, Oct 17 2018 6:27 PM

ప్రకటనే తరువాయి - Sakshi

ప్రకటనే తరువాయి

నామినేటెడ్ పోస్టుల తుది జాబితా రాహుల్ గాంధీకి అందజేత
 ఎంపికైన వారికి నేరుగా నియామక పత్రాలు అందజేస్తామన్న సీఎం సిద్ధరామయ్య
 పోస్టుల భర్తీలో తమకు అన్యాయం జరిగిందంటూ అంబరీష్ వర్గం ఆరోపణలు

 
బెంగళూరు : చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం ఓ కొలిక్కి వచ్చింది. ఈ నెలాఖరులోపు ఎట్టి పరిస్థితుల్లోనూ నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిందేనని హైకమాండ్ నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు జీ పరమేశ్వర్‌లు తాము  సిద్ధం చేసిన తుది జాబితాతో శుక్రవారం ఢిల్లీ  చేరుకున్నారు. అనంతరం ముందుగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్‌తో సిద్ధరామయ్య, పరమేశ్వర్  భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబితాను పరిశీలించిన దిగ్విజయ్ సింగ్ జాబితాను ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి అందజేయాల్సిందిగా సూచించారు.

దీంతో సిద్ధరామయ్య, పరమేశ్వర్‌లు శుక్రవారం సాయంత్రం రాహుల్‌గాంధీని కలుసుకొని జాబితాను అందజేశారు. ఇక ఈ జాబితాను పరిశీలించిన రాహుల్‌గాంధీ అనంతరం ఈ జాబితాను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. తుది జాబితాలో స్వల్ప మార్పులతో జాబితాకు సోనియాగాంధీ ఆమోద ముద్ర వేసినట్లు సమాచారం.  ఇక ఈ జాబితాలో ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానం కల్పించరాదని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్  సూచించినప్పటికీ, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కొంత మంది ఎమ్మెల్యేల పేర్లను సిద్ధరామయ్య, పరమేశ్వర్‌లు జాబితాలో చేర్చినట్లు సమాచారం. ఈ విషయంపై హైకమాండ్‌కు నచ్చజెప్పి తాము సూచించిన పేర్లతో కలిసి మొత్తం 80 మంది పేర్లతో కూడిన జాబితాకు ఆమోదాన్ని అందుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 
నేరుగా నియామక పత్రాలు


ఇక నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన వారి పేర్లకు పార్టీ హైకమాండ్ నుంచి ఆమోదం లభించినప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఈ విషయంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ...‘నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించిన జాబితాకు ఆమోదం లభించింది. ఈ జాబితాలోని వారికి ఫోన్ చేసి విషయాన్ని తెలియజెప్పడంతో పాటు వారికి నేరుగా నియామక పత్రాలను అందజేస్తాం’ అని తెలిపారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి అధికారిక ప్రకటనను వెలువరిస్తే, పార్టీలోని ఇతర వ్యక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదం ఉందనే పార్టీ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన జాబితా ఆలస్యంగా కనుక బయటికి వస్తే అసంతృప్తులను ఏదో ఓ విధంగా బుజ్జగించి వారిని దారిలోకి తెచ్చుకోవచ్చని సిద్ధరామయ్య, పరమేశ్వర్ భావిస్తున్నట్లు సమాచారం.

మాకు అన్యాయం జరిగింది....

నామినేటెడ్ పోస్టుల భర్తీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని అంబరీష్ వర్గానికి చెందిన నేతలు విమర్శిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఎక్కువగా ఎస్‌ఎం కృష్ణ వర్గానికే ప్రాధాన్యం కల్పించారని విమర్శిస్తూ మండ్య ప్రాంతానికి చెందిన కొందరు కార్యకర్తలు శుక్రవారమిక్కడ మంత్రి అంబరీష్‌ని ఆయన నివాసంలో కలిశారు. ‘పార్టీ కోసం ఇన్నాళ్లూ మేమూ శ్రమించాం. అయితే పదవుల విషయంలో మాత్రం మాకు అన్యాయం జరుగుతోంది. ఈ విషయంలో మీరు కలగజేసుకొని మాకు న్యాయం చేయండి’ అని వారు అంబరీష్‌ని కోరారు. ఈ అంశంపై మంత్రి అంబరీష్ స్పందిస్తూ...‘నేను నా అనుచరులకే పదవులు ఇవ్వమని కోరడం లేదు. పార్టీ కోసం నిజంగా శ్రమించిన వారిని మాత్రం తప్పక గుర్తించాల్సి ఉంటుంది అనేది నా అభిప్రాయం’ అని పేర్కొన్నారు.                                                                 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement