కాంగ్రెస్ ఓటమే లక్ష్యంగా విపక్ష కూటమి
Published Sat, Aug 10 2013 3:14 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ప్రతిపక్షాల ఓట్ల చీలిక ద్వారా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అవే పక్షాలు వ్యూహాత్మకంగా ఏకమై సవాలు విసురుతుండడంతో ఆందోళన చెందుతోంది. బీజేపీ ఓట్లను కేజేపీ, తన వ్యతిరేక ఓట్లను జేడీఎస్ గణనీయంగా చీల్చినప్పటికీ కాంగ్రెస్ బొటాబొటి మెజారిటీతో అందలం ఎక్కింది. ముఖ్యంగా కేజేపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప చీల్చిన ఓట్ల వల్ల బీజేపీ సుమారు 32 స్థానాల్లో ఓడిపోయింది.
అందులో 26 చోట్ల కాంగ్రెస్ గెలుపొందింది. కనీస మెజారిటీ కంటే ఆ పార్టీకి తొమ్మిది స్థానాలు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. ఈ లెక్కలు చూసుకునే ఆ పార్టీ హైరానా పడుతోంది. ముఖ్యంగా జేడీఎస్‌కు సహకరిస్తున్నందుకు బీజేపీపై మండి పడుతోంది. మరో వైపు సెక్యులర్ పార్టీ అని పేరు పెట్టుకున్న జేడీఎస్, బీజేపీతో చేతులు కలపడాన్ని తూర్పారబడుతోంది. ప్రస్తుతం అధికారాన్ని చెలాయిస్తున్నప్పటికీ, ఈ మూడు పార్టీల సహకారం క్షేత్ర స్థాయిలో విజయవంతమైతే కాంగ్రెస్‌కు శృంగ భంగం తప్పక పోవచ్చు.
అన్ని చోట్లా అవగాహన
బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. గతంలో ఈ రెండు స్థానాలూ జేడీఎస్‌వే. ప్రస్తుతం ఆ పార్టీకి అనుకూలంగా బీజేపీ తన అభ్యర్థులను బరి నుంచి తప్పించింది. సంప్రదాయికంగా ఈ రెండు స్థానాల్లో జేడీఎస్‌కు గట్టి పట్టుంది. బెంగళూరు గ్రామీణ నియోజక వర్గంలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి రెండున్నర లక్షల ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు పార్టీల సర్దుబాటుకు ఓటర్ల ఆమోదం లభిస్తే కాంగ్రెస్‌కు చిక్కులు తప్పకపోవచ్చు.
ధార్వాడ, మైసూరు, చిత్రదుర్గ శాసన మండలి స్థానాలకు ఈ నెల 22న ఉప ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో జేడీఎస్ ఎక్కడా అభ్యర్థులను నిలపలేదు. చిత్రదుర్గ, ధార్వాడలలో బీజేపీ పోటీ చేస్తోంది. కేజేపీ మైసూరు నుంచి పోటీ పడుతోంది. ధార్వాడలో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా కేజేపీ అభ్యర్థి పోటీ నుంచి తప్పుకున్నారు. మైసూరులో కేజేపీ అభ్యర్థికి అనుకూలంగా బీజేపీ తన అభ్యర్థిని రంగం నుంచి తప్పించింది. హఠాత్తుగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావడంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంత్రులను అప్రమత్తం చేశారు. ఈ ఉప ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని హెచ్చరించారు. కాగా శాసన మండలి ఎన్నికల్లో గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ, జిల్లా పంచాయతీ, పట్టణ స్థానిక సంస్థల సభ్యులు ఓటు వేయాల్సి ఉంది.
Advertisement
Advertisement