కురిసింది వాన...
మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైన వర్షం
రోడ్లపైకి చేరిన నీరు, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
బెంగళూరు: ఉద్యాననగరి వర్షపు జల్లుల్లో తడిసి ముద్దైంది. మంగళవారం ఉదయం నుంచే ప్రారంభమైన వర్షపు హోరు దాదాపు రెండు గంటలపాటు కొనసాగింది. దీంతో నగరంలోని పలురోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని మెజిస్టిక్, కేఆర్ మార్కెట్, విధానసౌధతోపాటు ఎంజీరోడ్, ప్యాలెస్ రోడ్, లాల్‌బాగ్‌రోడ్, బన్నేరుఘట్ట, బళ్లారిరోడ్లపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఉదయం నుంచే వర్షం ప్రారంభం కావడంతో పాఠశాలలకు చేరుకునేందుకు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతేకాక కిలోమీటర్ల మేర రోడ్లపై వాహనాలు నిలిచిపోవడంతో ఉద్యోగులు కార్యాలయాలకు చేరుకునేందుకు తిప్పలు తప్పలేదు. ఇక రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరంలోని అనేక అండర్‌పాస్‌లు చిన్నపాటి సరస్సులుగా మారిపోయాయి. కావేరీ జంక్షన్‌లోని అండర్‌పాస్‌తోపాటు ప్యాలెస్‌రోడ్, ఓరళిపురం అండర్‌పాస్‌లు పూర్తిగా నీరు నిలిచి సరస్సులను తలపించాయి.
ఇక డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వాన నీరు అనేక లోతట్టు ప్రాంతాల్లోకి చేరింది. దీంతో అనేక ప్రాంతాల్లో నివాస గృహాలు పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంలో బీబీఎంపీ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని నగరవాసులు విమర్శిస్తున్నారు. రెండు గంటల వాన కే నగరంలో పరిస్థితి ఇలా ఉంటే ఇక వర్షాకాలం ప్రారంభమైతే పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇక వర్షం కారణంగా పూర్తిగా ముంపునకు గురైన శ్రీనివాస లేఅవుట్‌ను మేయర్ శాంతకుమారి సందర్శించారు. అక్కడి రోడ్లపై పూర్తిగా నీరు నిలిచి వాహనాలు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమె కాలినడకనే ఆ ప్రాంతాన్ని సందర్శించాల్సి వచ్చింది. ఇక నగరంలో మరో మూడు రోజుల పాటు వర్షం కొనసాగే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీంతో మరో మూడు రోజులు ఉద్యాననగరవాసులకు ఈ తిప్పలు తప్పేటట్లు కనిపించడం లేదు.