
కొద్దిగంటల్లో పెళ్లి... అంతలోనే... వరుడు ఆకస్మిక మృతి
సచిన్ మృతదేహం
బెంగళూరు(బనశంకరి): కొద్దిగంటల్లో పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు ఆకస్మికంగా మృతిచెందిన ఘటన చిక్కమంగళూరు జిల్లా సుళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు... సుళ్య తాలూకా పంజ గ్రామంలోని కండూరకు చెందిన పరమేశ్వరగౌడ కుమారుడు సచిన్(29)కు ఎడమంగలలోని హొన్నప్పాడి బాలకృష్ణగౌడ కుమార్తె గాయత్రితో వివాహం నిశ్చయించారు. పైందోడి సుబ్రమణ్యస్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం వివాహం చేయడానికి ఇరుకుటుంబాలు సిద్ధమయ్యాయి.
మంగళవారం రాత్రే బంధుమిత్రులతో కళ్యాణమంటపానికి చేరుకోవడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఉదయం ఇంటిలో పెళ్లి కుమారుడు సచిన్ షేవింగ్ చేసుకుంటూ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. గాయపడిన బాధితుడిని వెంటనే పుత్తూరు ఆదర్శ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. సచిన్ మరణవార్త తెలియగానే ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు విషాదంలో మునిగిపోయారు. ఘటనపై సుళ్య పోలీసులు కేసు నమోదు చేశారు.