బెంగళూరు జల మండలి ద్వారా సరఫరా చేస్తున్న నీటికి టారిఫ్‌ను పెంచే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : బెంగళూరు జల మండలి ద్వారా సరఫరా చేస్తున్న నీటికి టారిఫ్‌ను పెంచే ప్రతిపాదనేదీ ప్రభుత్వం వద్ద లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. మంగళవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ టారిఫ్ పెంపుపై ఎలాంటి చర్చ కూడా జరగలేదన్నారు. టారిఫ్‌ను 50 శాతం మేర పెంచలంటూ జల మండలి ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు వార్తలు వచ్చాయి.
ఆయన ప్రధాని అయితే...
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రధాని అయితే దేశ ప్రజలు సుఖ శాంతులతో జీవించ లేరని, రక్తం ఏరులై పారుతుందని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇలాంటి వారికి ప్రజలు అవకాశం ఇవ్వకూడదని కోరారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఫ్రీడం పార్కులో కేపీసీసీ మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, గోద్రా హత్యాకాండలో ముస్లిం మహిళల పొట్టల్లో త్రిశూలాలు దించి భ్రూణ హత్యలకు కారణమైన మోడీ ఈ దేశ ప్రధాని కాకుండా చూడాల్సి ఉందన్నారు. కర్ణాటకలో మోడీ ఆటలు సాగవని అన్నారు.
లోక్‌సభ ఎన్నికల్లో 20కి పైగా స్థానాలను గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మోడీ తన ప్రసంగంలో పేదలు, రైతులు, కూలీల గురించి ఒక్క మాటైనా మాట్లాడలేదన్నారు. ఐటీ విప్లవం ఎన్‌డీఏ హయాం లో జరిగిందంటూ అబద్ధాలు చెప్పారని విమర్శించారు. వివిధ వర్గాల మధ్య విష బీజాలు నాటి వైషమ్యాలను పెంచడం బీజేపీకి అలవాటని దుయ్యబట్టారు. ఈ దేశానికి ప్రధాని కావాలన్న మోడీ ఆశలు అడియాసలవుతాయని ఆయన జోస్యం చెప్పారు. రైల్వే శాఖ మంత్రి మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతూ పేదల గురించి ఇందిరా గాంధీ ఎప్పుడూ ఆలోచించే వారని, వారి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారని వివ రించారు. దేశం కోసం ప్రాణాలను వదిలిన త్యాగమయి అని కొనియాడారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వీరప్ప మొయిలీ, మల్లికార్జున ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే. హరిప్రసాద్, పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు పాల్గొన్నారు.