సాక్షి, బళ్లారి: ఓటమి భయంతోనే సీఎం సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారని, ఐదు సంవత్సరాలు సీఎంగా పని చేసిన వ్యక్తిగా ఆయనే గెలవలేని పరిస్థితి ఉంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చని బీజేపీ శాసనసభా పక్ష నేత, మాజీ సీఎం జగదీష్ శెట్టర్ విమర్శించారు. ఆయన శనివారం హుబ్లీలో విలేకరులతో మాట్లాడారు. ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో పస లేదు, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే ఎక్కువ సీట్లు వస్తాయని సర్వేలు పేర్కొనడంలో నిజం లేదు అని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సర్వేలు అబద్ధమని తేలిపోయినట్లు చెప్పారు. గత లోక్‌సభ ఎన్నికల్లో మోదీ స్వతంత్రంగా అధికారంలోకి వస్తారని సర్వేలు చెప్పలేదని, అదే మాదిరిగా ఈసారి కూడా యడ్యూరప్ప కర్ణాటకలో సీఎం అవుతారని జోస్యం చెప్పారు. ఎన్నికలు అనంతరం సిద్దూ ఇంటికే పరిమితం అవుతారని, కాంగ్రెస్ ఎన్ని సర్వశక్తులు ఒడ్డినా తాము ఒంటరిగా 150 సీట్లతో గద్దెనెక్కుతామని జోస్యం చెప్పారు.
శ్రీరాములే పోటీ చేసి గెలుస్తారు
మొళకాల్మూరు ఎమ్మెల్యేగా తిప్పేస్వామి గెలుపొందారంటే అది శ్రీరాములు ఆశీస్సులే, గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్‌ఆర్‌సీపీ తరుపున తిప్పేస్వామికి శ్రీరాములు టికెట్ ఇవ్వడంతో పాటు గెలుపునకు కృషి చేయడంతో ఆయన ఎమ్మెల్యే అయ్యారన్నది మరువకూడదని శెట్టర్ హితవు పలికారు. శ్రీరాములుపై తిప్పేస్వామి తిరుగుబాటు చేయించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి వ్యవహరించారని, ఎట్టి పరిస్థితుల్లోను మొళకాల్మూరు నుంచి శ్రీరాములే పోటీ చేస్తారని, ఆయనే భారీ మెజార్టీతో గెలుపొందుతారన్నారు. తిప్పేస్వామి రాజకీయ సమీకరణలు నిజం కావన్నారు.
ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నిలబడటమో లేదా మరేదైనా నిర్ణయం తీసుకోవడంలో తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే అనవసర గొడవలకు దిగితే జనమే బుద్ధి చెబుతారన్నారు. శ్రీరాములుకు మొళకాల్మూరులో గెలిచే శక్తి ఉందన్నారు. ఆయన అక్కడే కాకుండా రాష్ట్రంగా పలు జిల్లాల్లో ప్రచారం చేసి బీజేపీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment