బంకులో దొంగతనానికి వచ్చిన వారు అక్కడ నిద్రిస్తున్న బిక్షగాడిని చంపారు
ఉదయగిరి(నెల్లూరు జిల్లా): బంకులో దొంగతనం చేసేందుకు వచ్చిన దొంగలు అక్కడ నిద్రపోతున్న భిక్షగాడిని హతమార్చిన సంఘటన నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మంగళవారం వేకువజామున జరిగింది. ఉదయగిరి బైపాస్‌రోడ్డులో ఒక చిన్న బంకు ఉంది. అక్కడ కిరాణా సరుకులు విక్రయిస్తుంటారు. ఆ ప్రాంతంలో భిక్షమెత్తుకుని జీవించే నరసింహ అనే వ్యక్తి రోజూ రాత్రిపూట బంకు పక్కనున్న పాకలో నిద్రించేవాడు.
మంగళవారం వేకువజామున బంకులో దొంగతన చేసేందుకు వచ్చిన దొంగలు నర్సింహ మేల్కోవడంతో అతని తలపై బాది హతమార్చి బంకులోని సరుకులు తీసుకెళ్లారు. ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఉదయగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.