కంప్లి: పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖలో చోరీ ప్రయత్నించిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. డీఎస్పీ లావణ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బ్యాంక్ భవనానికి పక్కన నిచ్చెన వేసి ఆ ప్రాంతంలో అమర్చిన సీసీ కెమెరా వైర్లను కత్తరించి తాళాలను పగలగొట్టి దోపిడీకి ప్రయత్నం చేశారన్నారు. ఘటన స్థలానికి సీఐ లింగనగౌడ, ఎస్‌ఐలు నాగరాజు, జితేంద్రలతో చేరుకొని పరిశీలించి బళ్లారి నుంచి వేలి ముద్రల నిపుణులను, జాగిలాలను రప్పించుకున్నారు.
కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వేసవిలో సాధారణంగా మేడలు, మిద్దెలపై నిద్రించడం సహజం అదను చూసుకొని దొంగలు దొంగతనాలు చేస్తుంటారు. గత వారం కంప్లి-కొట్టాల మార్గానగల ఓ దుకాణం షెట్టర్లకు వేసిన తాళాలను పగులగొట్టి దొంగతనం చేస్తున్న సందర్భంలో అలికిడితో దొంగలు పరారైన ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి 6వ వార్డులోని వెంకయ్య అనే ఓ ఇంటి యజమాని ఇంట్లోని మోటార్‌ను ఎత్తుకెళ్లిన ఘటన కూడా జరిగింది.