అసెంబ్లీ సమరం | This month's 14th session of the Budget Session begins | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ సమరం

Published Tue, Jun 6 2017 2:55 AM | Last Updated on Tue, Sep 5 2017 12:53 PM

అసెంబ్లీ సమరం

అసెంబ్లీ సమరం

అసెంబ్లీ బడ్జెట్‌ చర్చకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 14 నుంచి సభా పర్వం ప్రారంభం కానుంది. అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం డీఎంకే అస్త్రాలను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నం అయింది. అన్నాడీఎంకే  ఎమ్మెల్యేలు మూడు ముక్కలుగా మారిన వేళ సభా పర్వం సాగుతుండడంతో ఉత్కంఠ తప్పడం లేదు.
కుదిరిన ముహూర్తం
14 నుంచి సభా పర్వం
అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు అస్త్రాలు
ప్రధాన ప్రతిపక్షం సన్నద్ధం

సాక్షి, చెన్నై: అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు మార్చిలో మమ అనిపించే  విధంగా సాగిన విషయం తెలిసిందే. కేవలం 2017–18కి గాను బడ్జెట్‌ దాఖలుకు మాత్రమే సభను పరిమితం చేశారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల నగారా మోగడంతో శాఖల వారీగా నిధుల కేటాయింపులు, చర్చల పర్వాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ పరిస్థితుల్లో సభా వ్యవహారాలు ముగిసిందన్నట్టుగా ప్రభుత్వం గత నెల  ప్రకటించడం వివాదానికి దారి తీసింది.  శాఖల వారీగా నిధుల కేటాయింపులు, చర్చలకు ఆస్కారంలేకుండా వ్యవహారాలను ముగించడాన్ని ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా తప్పుబట్టింది.

ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ముందుకు సాగడంతో ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఈ సమయంలో అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇన్‌చార్జ్‌గా సంయుక్త కార్యదర్శి భూపతిని నియమించి సభా పర్వం సాగించేందుకు తగ్గ చర్యలు చేపట్టారు. ముహూర్తం కుదరడంతో రాష్ట్ర గవర్నర్‌(ఇన్‌) సీహెచ్‌ విద్యాసాగర్‌రావుకు అసెంబ్లీ నిర్వహణకు తగ్గ ప్రతిపాదనలు పంపించారు.

ఇందుకు ఆయన ఆమోద ముద్ర వేయడంతో సభా పర్వం ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని సోమవారం అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ కార్యదర్శి భూపతి ప్రకటించారు. ఆ రోజు  ఉదయం పది గంటలకు సభ ప్రారంభం అవుతుంది. 13వ తేదీన స్పీకర్‌ ధనపాల్‌ నేతృత్వంలో అసెంబ్లీ వ్యవహారాల కమిటీ సమావేశం కానుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏయే అంశాలపై చర్చ, నిధుల కేటాయింపులు, శాఖల వారీగా సాగే చర్చల వివరాలను ప్రకటించనున్నారు.

ఇక సమరం:  ఈ నెల 14వ తేదీ నుంచి సభ ప్రారంభం కానుండడంతో సభ వాడివేడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మూడు ముక్కలు అయ్యారు. అమ్మ శిబిరం, పురట్చి తలైవి శిబిరం అంటూ ఇన్నాళ్లు సాగినా, ప్రస్తుతం ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీకి మద్దతుగా మరి కొందరు ఎమ్మెల్యేలు చేరడంతో సభా పర్వం వేడెక్కడం ఖాయం. అధికార పక్షాన్ని ఢీ కొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం దూకుడు పెంచే అవకాశాలు ఎక్కువే. డీఎంకే అధినేత కరుణానిధి వజ్రోత్సవాల ప్రస్తావన సభ ముందుకు రాకుండా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం సాగించిన కుట్రను ఎత్తి చూపుతూ సమరం సాగించే అవకాశాలు ఎక్కువే. రైతు ఆత్మహత్యలు, కరువు తాండవం, తాగునీటి సమస్య, నీట్, శాంతి భద్రతల వైఫ్యలం, పశు వధ నిషేధం వ్యవహారం, స్థానిక ఎన్నికలు, జీఎస్‌టీ తదితర అంశాలపై అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం సిద్ధం అవుతోంది.

ఈ సమావేశాల్లో సభ దృష్టికి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపులు, జీఎస్‌టీ ముసాయిదాలు తీసుకొచ్చే అవకాశాలు ఎక్కువే. జీఎస్‌టీ అమలుకు కేంద్రం ఆదేశించిన దృష్ట్యా, సభలో తమిళనాడు జీఎస్‌టీని పరిచయం చేస్తూ ముసాయిదాను ఆర్థిక మంత్రి జయకుమార్‌ దాఖలు చేయడం ఖాయం. జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన పక్షంలో రాష్ట్రంలో బంగారం కొనుగోళ్లపై పన్నుల మోత మోగుతుందని వర్తకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సభాపర్వం ఈ సారి నెల రోజుల పాటుగా జరిగే అవకాశాలు ఉన్నాయి.  36 శాఖలపై నిధుల కేటాయింపులు, చర్చ సాగించాల్సి ఉన్న దృష్ట్యా, రోజుకు రెండు అంశాలపై చర్చ సాగించేందుకు తగ్గ కార్యాచరణ సిద్ధం అవుతోంది

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement