ఐటీ మంత్రికి షాక్!
సాక్షి, చెన్నై: ఐటీ మంత్రి మణిగండన్‌కు అమ్మ జయలలిత షాక్ ఇచ్చారు. ఆయన చేతిలో ఉన్న రామనాథపురం జిల్లా కార్యదర్శి పదవిని వెనక్కు లాగేసుకున్నారు. కొత్త కార్యదర్శిగా ఎంకే మునుస్వామిని నియమించారు. జిల్లా పదవి ఊడడంతో త్వరలో మంత్రి పదవి కూడా మణిగండన్ చేతి నుంచి జారినట్టే అన్న ప్రచారం బయలు దేరింది. అన్నాడీఎంకేలో, అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఎవరి పదవులకు గ్యారంటీ లేదు. ఎవరి మీద ఎప్పుడు అమ్మ కన్నెర్ర చేస్తారో, పదవులు ఊడుతాయో చెప్పలేం. రాత్రి మంత్రిగా గుడ్ నైట్ చెప్పిన వాళ్లు గుడ్ మార్నింగ్ చెప్పేలోపే మాజీలు అయ్యే పరిస్థితి.
మంత్రి వర్గంలో తరచూ మార్పులు జరగడం, పార్టీ పదవుల నుంచి నేతల్ని సాగనంపడం అమ్మకు పరిపాటే. కొత్త ప్రభుత్వంలో పలువురి చేతిలో ఉన్న అదనపు బాధ్యతల్ని మరి కొందరికి అమ్మ పంచి పెట్టారేగానీ, ఇంత వరకు ఏ మంత్రికీ ఉద్వాసన పలకలేదు. ఇందుకు సమయం ఆసన్నమైనట్టుంది. ఇందుకు అద్దం పట్టే రీతిలో జిల్లా కార్యదర్శి పదవి ఓ మంత్రి చేతి నుంచి ఊడింది. ఈ పదవి ఊడిన పక్షంలో మంత్రి పదవి కూడా త్వరలో దూరం అయినట్టే. ఇందుకు గత అనుభవాలే నిదర్శనం.
మంత్రికి షాక్: రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే వైద్య విభాగం నేత మణిగండన్ శాసన సభలో అడుగు పెట్టారు. ఎంఎంకే నేత జవహిరుల్లాను ఓడించిన మణిగండన్‌కు ఐటీ శాఖను అప్పగిస్తూ అమ్మ జయలలిత నిర్ణయం తీసుకున్నారు. మణిగండన్ పార్టీ కోసం శ్రమిస్తున్నారని చెప్పడం కన్నా, ఆయన తండ్రి రామనాథపురం పార్టీ ప్రిసీడియం చైర్మన్ మురుగేషన్ సేవలకు గుర్తింపుగా పదవులు దక్కాయని చెప్పవచ్చు.
మంత్రిగా అవతరించిన మణిగండన్ తన నివాసాన్ని మదురైకు పరిమితం చేశారు. రామనాథపురం జిల్లా కార్యదర్శిగా కూడా పార్టీ పదవిలో ఉన్న ఆయన తనకు వ్యతిరేకంగాఎన్నికల్లో వ్యవహరించిన అధికారుల భరతం పట్టే విధంగా వ్యవహరించడం వివాదానికి దారి తీసింది. పలువురు అధికారులు అమ్మ దృష్టికి తీసుకురావడం, అదే సమయంలో జిల్లా వైపుగా మంత్రి తొంగిచూడడం లేదన్న ఫిర్యాదులతో ఆయనకు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని గురువారం అమ్మ జయలలిత తీసుకున్నారు.
జిల్లా కార్యదర్శి పదవి నుంచి ఆయన్ను తొలగించడమే కాకుండా, ఆయన వెన్నంటి ఉన్న యూనియన్, జిల్లా యూనియన్ పదవుల్లో ఉన్న మీనాక్షి సుందరం, కె హేమ, సత్యమూర్తిలతో పాటు పలువురికి ఉద్వాసన పలుకుతూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రి చేతిలో ఉన్న జిల్లా పదవి ఊడినా, వైద్య విభాగం కార్యదర్శి పదవి మాత్రం అలాగే ఉంచారు. అయితే, జిల్లా పదవి ఊడిన దృష్ట్యా, త్వరలో ఆయన మంత్రి పదవిని సైతం కోల్పోయే అవకాశాలు ఎక్కువే. ఇక, రామనాథపురం జిల్లాకు కొత్త కార్యదర్శి గతంలో కార్యదర్శిగా పనిచేసిన మునుస్వామిని నియమించారు.
అలాగే, మునుస్వామి సతీమణి కృతిక ముదగళత్తూరు నుంచి ఓటమి చవి చూశారు. ఓడినా ఆమెకు గుర్తింపు ఇస్తూ, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించడం గమనార్హం. తనకు జిల్లా కార్యదర్శి పదవి మళ్లీ కట్టబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ చెన్నై చేరుకున్న మునుస్వామి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు.