- త్వరలో పెరగనున్న బస్, కరెంట్ చార్జీలు
- ‘కోడ్’ తొలగిన వెంటనే అమల్లోకి
- కేఈఆర్‌సీకి ఎస్కాం ప్రతిపాదనలు
- యూనిట్‌కు 66 పైసలు పెంచే అవకాశం
- డీజిల్ ధర పెరగడంతో ఆర్టీసీపై భారం
- చార్జీలు 10 నుంచి 12 శాతం పెంచే యోచన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో రాష్ర్ట ప్రభుత్వం ప్రజలపై చార్జీల భారం మోపడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఇప్పటికిప్పుడు చార్జీల మోత ఉండకపోయినా.. సమీప భవిష్యత్తులోనైనా వాతలు తప్పకపోవచ్చు. నియమావళి నుంచి మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. దీనిపై కమిషన్ సానుకూలంగా స్పందిస్తే వెంటనే చార్జీలు పెంచడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
కరెంటు చార్జీలు పెంచాలని ఎస్కాంలు ఇదివరకే కర్ణాటక విద్యుత్ నియంత్రణ సంఘానికి (కేఈఆర్‌సీ) ప్రతిపాదనలు పంపాయి. ఇప్పటికే నష్టాల్లో కూరుకుపోయామని, వేసవిలో అధిక ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందని మొర పెట్టుకున్నాయి. కనుక యూనిట్‌కు 66 పైసలు వంతున పెంచాలని ప్రతిపాదించాయి. కేఈఆర్‌సీ కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఒక వేళ చార్జీలు పెంచితే రెండేళ్లలో ఇది ఆరోసారి అవుతుంది. కాగా వ్యవసాయానికి 10 హెచ్‌పీ వరకు, భాగ్య జ్యోతి, కుటీర జ్యోతి పథకాల కింద ఉన్న కనెక్షన్లకు చార్జీలను పెంచబోరు.
బస్సు చార్జీలు కూడా...
విద్యుత్ చార్జీల బాటలోనే బస్సు చార్జీలు కూడా పెరగనున్నాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఇదివరకే చార్జీల పెంపునకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రతిపాదన వచ్చినందున, ప్రభుత్వం వెంటనే స్పందించ లేదు. ఇక స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
ఆర్టీసీతో పాటు బీఎంటీసీ, ఈశాన్య, వాయువ్య రోడ్డు రవాణా సంస్థలు చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచాయి. డీజిల్ ధర, కార్మికులకు డీఏ, విడి భాగాల ధర పెంపు వల్ల 2013 జూన్ నుంచి ఇప్పటి వరకు ఆర్టీసీకి రూ.120 కోట్లు, బీఎంటీసీకి రూ.290 కోట్ల నష్టం వాటిల్లాయి. ఇటీవల డీజిల్ ధర లీటరుకు 60 పైసలు పెరిగినందున నాలుగు కార్పొరేషన్లకు ఏడాదికి రూ.36 కోట్ల అదనపు భారం పడుతోంది. నష్టాల భారం తడిసి మోపెడవుతున్నందున 10 నుంచి 12 శాతం చార్జీలు పెంచడానికి అనుమతి కోరాయి.