సాక్షి, న్యూఢిల్లీ: నిన్నామొన్నటిదాకా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటగా ఇప్పుడు ఆ స్థానంలోకి టమాటా వచ్చింది. టోకు మార్కెట్లలోనే కిలో టమాటోల ధర రూ.40 పలుకుతోంది. ఇక చిల్లర వ్యాపారులు కిలో రూ. 50 లేదా రూ. 60కి విక్రయిస్తున్నారు. తొలకరి ప్రారంభమైనా తగురీతిలో వర్షాలు కురవకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాజధా ని నగరానికి సిమ్లా, బెంగళూర్. మహారాష్ట్రల నుంచి టమాటాలు వస్తున్నాయని టోకు వ్యాపారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనే టమాటాలు కిలో రూ. 30 పలుకుతున్నాయని, అందువల్ల ఇక్కడికి వచ్చే సరికి వాటి ధర మరింత పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.
వానలు పడనందువల్ల టమాటాల దిగుబడి తగ్గిందని, ఒకవేళ ఇప్పుడు ఒక్కసారిగా వానలు పడినా పండిన టమాటాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉండడం వల్ల మార్కెట్‌కు టమాటాల తగ్గుముఖం పట్టిందని వారు చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో టమాటా ధర పెరగడం సహజమేనని వారు అంటున్నారు. జూలై నెల ఆరంభంలో కిలో టమాటోల ధర టోకు మార్కెట్లో రూ.10-15, చిల్లర మార్కెట్‌లో రూ. 20-30 ఉంది. పది రోజుల్లో టమాటాల ధర రెట్టింపయ్యింది.
అప్పట్లో ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్‌ల నుంచి టమాటాలు నగరానికి రావడంతో వాటి ధర తక్కువగా ఉందని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి టమాటాల రాక వారం కిందట ఆగిపోయిందని, దూరప్రాంతాల నుంచి నగరానికి వస్తున్నందువల్ల రవాణా చార్జీల భారం కూడా వీటి ధరను పెంచిం దని వారంటున్నారు. టమాటాలు మాత్రమే కాకుండా పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయల రాక కూడా ఆగిపోయింద ని, అందువల్ల మున్ముందు టమాటాలతోపాటు ఇతర కూరగాయల ధరలు మరింత పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఇది చాలా రేటు గురూ..!
Published Mon, Jul 14 2014 10:45 PM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM
Advertisement