సాక్షి, ముంబై: బాంద్రా-ఖార్ తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. పశ్చిమఖార్ ప్రాంతంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా ఈ బిల్లు ఆమోదం పొందడంపట్ల అంతా హర్షం వ్యక్తం చేశారు. టపాసులు కాల్చి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంటీజేసీ కన్వీనర్ దేవానంద్ నాగేల్ల, ఎబీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్, బోరివలిలోని బీజేపీ నాయకులు మేకల హన్మంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ అమరవీరుల త్యాగాల ఫలితంగానే కల నెరవేరిందన్నారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే ధీమా వ్యక్తం చేశారు.
నగరంలో నివసించే తెలంగాణ వలసబిడ్డల కోసం రైలు, బస్సు సౌకర్యాలతోపాటు వారి పిల్లలు తెలుగు చదువుకునేందుకుగా అన్ని విధాలుగా సహకరించాలన్నారు. ఇక్కడ కూడా తెలంగాణ భవనం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేయాలని కోరారు ప్రత్యేక తెలంగాణ కోసం అసువులు బాసిన అమరవీరులతోపాటు తెలంగాణ బిల్లు ఆమోదం కోసం కృషి చేసిన అన్ని రాజకీయ నాయకులకు, గతంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న వారందరికీ కృత/్ఞతలు తెలిపారు.
బోరివలిలో ఆదివారం జరగనున్న తెలంగాణ విజయోత్సవ సభను అందరు విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాంద్రా-ఖార్ తెలంగాణ కార్మిక సంఘం అధ్యక్షులు జెట్టా కృష్ణ, ప్రధాన కార్యదర్శి పిట్టల గణేశ్, పోతుల రాములు, దాసరి అంజయ్య, బాల్ల జంపయ్య, కె. రాంచంద్రం, వి. నర్సింలు, కె. బాబు, బి శ్రీనివాస్, కె.తిరుపతి, ఎ డేవిడ్, కె.ఉప్పలయ్య, నాగిరెడ్డి, సి.ఎం. చంద్రమౌళి, కుండె చంద్రమౌళి, జె.రామచందర్, టి.సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
పశ్చిమ గోరేగావ్‌లో
పశ్చిమ గోరేగావ్‌లో రిలయన్స్ కార్మిక సమాఖ్య ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కార్మికులంతా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. అమరులను స్మరించుకుని జై తెలంగాణ అంటూ భారీఎత్తున నినదించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదిక సభ్యుడు శేఖర్ గ్యారా మాట్లాడుతూ ఇటువంటి సమయంలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్, ఆకుల భూమయ్య, కొండా లక్ష్మణ్‌బాపూజీ లేకపోవడం దురదృష్టకరమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో అంతా కలిసికట్టుగా తోడ్పడాలని పిలుపునిచ్చారు.
అనంతరం తెలంగాణ రిలయన్స్ కార్మిక సమాఖ్య నాయకులు కావలి యాదయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సంఘటితంగా పోరాడారని, తత్ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రంలో తీవ్రవాదం పెరుగుతుందంటూ సమైక్య నాయకులు చెప్పే మాటలను తెలంగాణ ప్రజా సంఘం అధ్యక్షుడు విరమల్ల మల్లేశ్ ఖండించారు. తెలంగాణ బిల్లు ఆమోదానికి కృషిచేసిన వివిధ పార్టీల నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వలిగొండ అంజ య్య, బూడిద కిషన్, గాదే మల్లేశ్, ప్రేమనంద్, నర్సిరెడ్డి, వంగూరి సైదులు తదితరులు పాల్గొన్నారు.
అంధేరీ పరిసరాల్లో
తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో అంధే రీ పరిసరాల్లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. 10వ రోడ్డు, జుహూ గల్లీ, భరత్ నగర్, నెహ్రూనగర్ ప్రజలు బాణసంచా కాలుస్తూ, రంగులు చల్లుతూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు బతకమ్మ ఆడుతూ పాటలు పాడారు. అనంతరం స్థానిక శివసేన నాయకుడు పరశురాములు పాటిల్ ఆధ్వర్యంలో కేక్ కోసి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ముంబై ప్రాంత కార్యదర్శి నారాయణగౌడ్ మాట్లాడుతూ యువకుల ఆత్మబలిదానాలవల్ల ప్రస్తుత తెలంగాణ వచ్చిందన్నారు.
ఈ విజయం తెలంగాణ అమరులకే అంకితమన్నారు. టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి మద్దెల సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ కిరణ్, జగన్. చంద్రబాబు, అశోక్‌బాబు... ఈ నలుగురు బాబులు కలసి తెలంగాణ ఏర్పాటు కాకుండా ఢిల్లీలో కుట్రలు, కుతంత్రాలు చేసి అడ్డుకునేందుకు యత్నించారని ఆరోపించారు. అయినప్పటికీ కేంద్రం... తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపిందన్నారు. అనంతరం టీఆర్‌ఎస్ ముంబై ప్రాంత ఉపాధ్యక్షుడు కన్నేస్వామి మాట్లాడుతు 60 ఏళ్ల ఉద్యమ ఫలితంగానే తెలంగాణ కల నెరవేరింది. ఇది వారి త్యాగాల ఫలితమేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సభ్యులు ఇస్తారి యాదయ్య, బండయ్య దేవేందర్, చంద్రశేఖర్, వెంకటేశం, ఎం. శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.
ఠాణేలో.....
ఠాణేలోని వాఘ్లే ఎస్టేట్‌లో శ్రీ హనుమాన్ తెలుగు సేవా మండల్ తరపున తెలంగాణ ప్రజలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. స్థానిక తెలంగాణ వాసులు అత్యధిక సంఖ్యలో పాల్గొని బాణా సంచా కాలుస్తూ రంగులు చల్లుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాలు మెట్ల బాలస్వామి ఆధ్వర్యంలో జరిగాయి.
బాంద్రాలో ‘జల్లోష్’
తెలంగాణ బిల్లు గురువారం రాజ్యసభలో మంజూరైన శుభసందర్భాన్ని పురస్కరించుకుని బాంద్రాలోని రిలయన్స్ కంపెనీ ప్రాంగణంలో తెలంగాణావాదులు ‘జల్లోష్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళాక్షి సోషల్ అండ్ కల్చరల్ ఫౌండేషన్, రిలయన్స్ ఎనర్జీ తెలంగాణ కార్మిక సమాఖ్యలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా సమాఖ్య అధ్యక్షుడు కె.నర్సింహగౌడ్ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ప్రధాన కారణం నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల పోరాటమేనంటూ కొనియాడారు. అనంతరం మంగళాక్షి సంస్థ ప్రధాన కార్యదర్శి సరిపంగి రవీందర్ మాట్లాడుతూ గత పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఎట్టకేలకు వారు తెలంగాణ ప్రజల ఒత్తిడివల్ల దారికి వచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో మంగళాక్షి సంస్థ కార్యకర్తలు కొమ్ము అంజయ్య, నర్సపెల్లి మధుసూదన్, నల్లా శంకర్, సరిపంగి మల్లేశ్, సమాఖ్య నాయకులు పాలకూరి యాదయ్య, పెద్దురి శ్రీధర్, జనార్దన్, ఎన్.రామలింగం తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్ జీఎం మహేంద్ర చవాన్, డీజీఎం పాండురంగ్ కాలేకర్‌లు పాల్గొని కార్మికులకు మిఠాయిలు పంచారని నర్సింహగౌడ్ చెప్పారు.
త్యాగాల ఫలితమే తెలంగాణ: బద్ది
ప్రపంచంలో ప్రాణానికన్నా విలువైనదేదీ లేదని, అలాంటి ప్రాణాలను తెలంగాణ రాష్ట్రం కోసం ధారపోసిన యు వకులు నిజంగా అమరులని టీఆర్‌ఎస్ ముంబై అధ్యక్షుడు బద్ది హేమంత్‌కుమార్ ఉద్ఘాటించా రు. తెలంగాణ బిల్లు రాజ్యసభలో మంజూరు కావడంతో టీఆర్‌ఎస్ నాయకులు చెంబూర్‌నాకావద్ద గురువారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హేమంత్‌కుమార్ మాట్లాడుతూ దాదాపు 15వందల యువకుల త్యాగాలకు ఫలితమని, 13 సంవత్సరాల కేసీఆర్ ఉద్యమం కారణంగా ఇప్పటికి తెలంగాణ ఆసన్నమైందన్నారు.
టీజేఏసీ, టీజీఓ, టీఎన్‌జీఓ, ప్రజా సంఘాల పోరాటం, ఎంపీలు వివేకానంద్, జగన్నాథం, కె.కె. తదితరులు టీఆర్‌ఎస్‌లో చేరడంవల్ల తెలంగాణ సాధ్యమైంది. సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈ సంబరాల్లో టీఆర్‌ఎస్ ముంబై ప్రధాన కార్యదర్శి బోలె శివరాజ్, టీఆర్‌ఎస్ చెంబూర్ కార్మిక శాఖ అధ్యక్షుడు చంద్రాగౌడ్, నాయకులు సాంబయ్య, సుంకే అంజయ్య, శ్రీనివాస్, ఎ. రమేష్, లక్ష్మీబాయి, ఎంటీజేఏసీ కన్వనర్ ఎన్.దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. కాగా గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు తెలంగాణ విజయోత్సవ సభ నిర్వహించనున్నట్టు హేమంత్‌కుమార్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ పెద్దసంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
‘టీ’ ధూం ధాం
Published Fri, Feb 21 2014 11:11 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM
Advertisement
Advertisement