'జీవితాంతం ఉత్తమ్ గడ్డంతో ఉండాల్సిందే'
'జీవితాంతం ఉత్తమ్ గడ్డంతో ఉండాల్సిందే'
Published Wed, Jan 25 2017 2:40 PM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాల ప్రచారం చేయడంలో దిట్ట అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన విమర్శించారు. అధికారం లేకపోయే సరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామాల్లో తిరుగుతూ ప్రభుత్వంపై అబద్దాలను మళ్లీ మళ్లీ చెబుతున్నారన్నారు.
బుధవారమిక్కడ కర్నె ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తమ్ పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాధాన్యమున్న అంశాలను అసెంబ్లీలో చర్చించలేదని ఉత్తమ్ పేర్కొనడం ఆయన అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ఉత్తమ్ ప్రజా వ్యతిరేకిగా మాట్లాడుతున్నారని, ప్రజలకు ఉపయోగపడే అన్ని అంశాలపై అసెంబ్లీ వేదికగా చర్చ జరిగిందని చెప్పారు.
పేదల గృహ రుణాలు 3600 కోట్లు మాపీ చేయడం ప్రాధాన్యతా అంశం కాదా? మైనారిటీలకు చేయూత నివ్వడం, రైతులకు భరోసా ఇవ్వడం ముఖ్యమైన అంశాలు కాదా అని ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేంత వరకు గడ్డం తీయబోనని ఉత్తం చెబుతున్నారని, వాళ్ల తీరు చూస్తుంటే ఉత్తమ్ జీవితాంతం గడ్డంతో ఉండాల్సిందేనని ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత ఉత్తమ్ హిమాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావొచ్చని ఆయన చెప్పారు.
Advertisement
Advertisement