ఇద్దరు ఏటీఎం దొంగల అరెస్టు | Two arrested for attempting to break open ATM in Noida | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఏటీఎం దొంగల అరెస్టు

Published Mon, Sep 22 2014 11:06 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

Two arrested for attempting to break open ATM in Noida

నోయిడా: ఏటీఎంను బద్దలు కొట్టేందుకు ప్రయత్నించిన ఇద్దరు పోలీసులకు పట్టుబడ్డారు. వివరాల్లోకెళ్తే... క్లీనర్లుగా పనిచేస్తున్న రోహతష్ చౌహాన్, గుల్షన్ తివారీలో డీఎస్‌సీ రోడ్డులోగల ఏటీఎంను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తుండగా అదే సమయంలో పెట్రోలింగ్ కోసం తిరుగుతున్న పోలీసుల కంట పడ్డారు. సెక్యూరిటీ గార్డు లేకపోవడం, ఏటీఎంలో నుంచి శబ్ధాలు వస్తుండడంతో అనుమానం వచ్చిన పోలీసులు లోపలికి వెళ్లి చూసేసరికి మెషీన్‌ను తెరిచేందుకు ప్రయత్నిస్తున్న చౌహాన్, తివారీలు కనిపించారు. దీంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. తాము డబ్బులు డ్రా చేసుకునేందుకు వచ్చామని, తమ కార్డు అందులో ఇరుక్కుపోయిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు.
 
 దీంతో సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా మెషీన్‌ను బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపెట్టారు. డీఎస్‌పీ కుమార్ మిశ్రా ఈ విషయమై మాట్లాడుతూ... సెక్టార్ 44లోగల యాక్సిస్ బ్యాంకు ఏటీఎంను కూడా బద్దలు కొట్టేందుకు గత వారం ప్రయత్నించారని, అయితే సఫలీకృతం కాలేదన్నారు. రెండో ప్రయత్నంగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ బికనర్ అండ్ జైపూర్ ఏటీఎంను బద్దలు కొట్టాలని నిర్ణయించుకొని, అందుకు డీఎస్‌సీ మార్గ్‌లోగల ఏటీఎంను ఎంచుకున్నారని చెప్పారు. అక్కడ సెక్యూరిటీ గార్డు లేకపోవడం, ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో తమ పని సులువవుతుందని భావించారని, అయితే అదే సమయంలో పోలీసులు పెట్రోలింగ్‌కు వెళ్లడం, అనుమానం రావడంతో ఏటీఎం వద్దకు వెళ్లి చూడడంతో ఈ ఇద్దరి బాగోతం బయటపడిందని చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement