ఒకే రోజు రెండు ఎన్నికలు
Published Thu, Sep 12 2013 1:57 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
న్యూఢిల్లీ: నగరంలోని రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలైన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ), ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) ప్రాంగణాలు ఈ నెల 13వ తేదీన విద్యార్థి సంఘాల ఎన్నికలకు వేదికలు కానున్నాయి. కాంగ్రెస్ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ, ఆర్‌ఎస్‌ఎస్ మద్దతు కలిగిన బీజేపీ అనుబంధ ఏబీవీపీలు ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం (డూసూ) ఎన్నికల బరిలోకి దిగాయి. ఎన్నికల తేదీ అధికారికంగా ప్రకటించకముందే ఈ రెండు పార్టీలు ఎన్నికల ప్రచార బరిలోకి దూకాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం డీయూ విశ్వవిద్యాలయ ప్రాంగణం నిండా ఇరు పార్టీలు విచ్చలవిడిగా పోస్టర్లు అంటించాయి.
ఈ ఎన్నికలను విశ్వవిద్యాలయ యాజమాన్యమే నిర్వహిస్తున్నప్పటికీ ఎన్‌ఎస్‌యూఐ, ఏబీవీపీల మధ్య అనేక పర్యాయాలు ఘర్షణలు జరిగాయని, కొంతమంది గాయపడినట్టు తెలియవచ్చింది. ఇక ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవి కోసం 12 మంది, ఇక కార్యదర్శి పదవికోసం 17, సంయుక్త కార్యదర్శి పదవి కోసం పది మంది పోటీ చేస్తున్నారు. అభ్యర్థులు తమ వాణిని ఓటర్లను వినిపించేందుకు ఢిల్లీ విశ్వవిద్యాలయం అన్ని అవకాశాలు కల్పించింది. కమ్యూనిటీ రేడియో, వెబ్‌సైట్‌లను వినియోగించుకునేందుకు అనుమతించింది. అంతేకాకుండా విద్యార్థులు తమ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ డీయూ ఎన్నికల ఇన్‌చార్జి ఓ లేఖ కూడా రాశారు. ‘పెద్దసంఖ్యలో మీరంతా ఈ ఎన్నికల్లో పాల్గొనాలని, ఎటువంటి భయమూ లేకుండా ఓటు వేయాలని నేను ఆకాంక్షిస్తున్నా.
ఇక అభ్యర్థులను ఎన్నుకునే విషయానికి సంబంధించి మీకు సరైన ప్రాతినిధ్యం ఎవరు వహించగలుగుతారనే విషయాన్ని ఆలోచించండి. అదేవిధంగా విశ్వవిద్యాలయం నిర్ణాయక సమావేశాల్లోనూ అదే స్థాయిలో ఎవరు వ్యవహరించగలుగుతారనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఇక జవహర్‌లాల్ నెహ్రూ (జేఎన్‌యూ) విషయానికొస్తే విద్యార్థులే ఎన్నికలను నిర్వహించుకుంటారు. వామపక్ష విద్యార్థి సంఘాలు ఆదినుంచి ఈ ధోరణిని అవలంబించాయి. జేఎన్‌యూ అధ్యక్ష పదవికి మొత్తం ఎనిమిది మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక ఉపాధ్యక్ష పదవికి ఐదుగురు, ప్రధాన కార్యదర్శి పదవికి ఆరుగురు, సంయుక్త ప్రధాన కార్యదర్శి పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
జేఎన్‌యూ ఎన్నికల బరిలో గే
జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి సంఘం ఎన్నికల బరిలోకి దిగినవారిలో వివిధ రకాల వ్యక్తుల సమ్మేళనం కలగలిసి ఉంది. ఎంఫిల్ చదువుతున్న గుంజన్ ప్రియ అనే విద్యార్థిని పోటీ పడుతుండగా ఆమె తరఫున ఆమె కుమార్తె శ్రుతి ప్రచారం చేస్తోంది. భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్) తరఫున గుంజన్ బరిలోకి దిగింది. దీంతో తల్లి తరఫున ప్రచార భారం నెత్తికెత్తుకున్న శ్రుతి తన అమ్మకు ఓటు వేయాలంటూ విద్యార్థులందరినీ అభ్యర్థిస్తోంది. ఇందుకు సంబంధించి కరపత్రాలను వారికి అందజేసిన అనంతరం లాల్‌సలామ్ కూడా చెబుతోంది. కాగా ఇదే పతాకం కింద ప్రధాన కార్యదర్శి పదవికి గౌరబ్ ఘోష్ అనే గే కూడా పోటీపడుతున్నారు.
ఈ సందర్భంగా గౌరబ్ మాట్లాడుతూ ‘లెస్బియన్, గే, బెసైక్సువల్, ట్రాన్స్‌జెండర్ (ఎల్‌జీబీటీ) సమాజానికి చెందినవారిని కూడా జేఎన్‌యూకి చెందిన విద్యార్థులు అంగీకరించాల్సిన అవసరం ఉంది. ఎటువంటి వివక్ష ఉండకూడదని, సమానత్వం ఉండాలనేదే నా డిమాండ్’ అని ఈ సందర్భంగా కోల్‌కతాకు చెందిన గౌరబ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల బరిలో కజకిస్థాన్‌కు చెందిన మెట్‌బెకోవ్ ఝస్సులాన్ కూడా పోటీ చేస్తున్నాడు. ఝస్సులాన్ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నాడు. తాను మధ్యవర్తిగా నియమించుకున్న నవీన్ సర్కారు సహాయంతో ఓటర్లతో సంభాషిస్తున్నాడు. అనేక బంగారు పతకాలను సొంతం చేసుకున్న ఝస్సులాన్ ప్రస్తుతం జేఎన్‌యూలో ఆర్థికశాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. జనతాదళ్ (యూ) తరఫున బరిలోకి దిగాడు.
Advertisement
Advertisement