సాక్షి, ముంబై: శాంతాక్రజ్-చెంబూర్ లింక్‌రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్) అందుబాటులోకి రావడం నగరవాసులకు వరంగా మారింది. ఈ మార్గంలో ఆటోలు ట్యాక్సీల్లో రాకపోకలు సాగించేవారికి ప్రయాణం మరింత చౌకగా మారింది. ఈ మార్గంలో ప్రయాణిస్తే రూ.50 నుంచి 60 వరకు డబ్బు ఆదా అవుతోందంటూ ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది అందుబాటులోకి రాకముందు ధారవి మీదుగా ములుండ్ నుంచి వకోలాకు వెళ్లాలంటే 23 కి.మీ. దూరం ప్రయాణించాల్సి వచ్చేది.
ఇందుకోసం ఆటోకి రూ 226 కాగా, ట్యాక్సీకి రూ.284 చెల్లించాల్సి వచ్చేది. అయితే ఇది అందుబాటులోకి వచ్చాక ఆటోకి రూ.177, ట్యాక్సీకి రూ.222 మాత్ర మే అవుతోంది. పైగా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయింది. పైగా ఆటో ప్రయాణికులకు వెయిటింగ్ చార్జీలు కూడా తగ్గాయి. ప్రియదర్శిని సర్కిల్, సైన్, సైన్ స్టేషన్, ధారావి-టీ జంక్షన్ల వద్ద ప్రతి నిత్యం ట్రాఫిక్ నిలిచిపోయేది. దీంతో వెయిటింగ్ చార్జీ భారం కూడా ప్రయాణికులపైనే పడేది. అయితే కొత్త మార్గం అందుబాటులోకి రావడంవల్ల సమయంతోపాటు డబ్బు కూడా ఆదా అవుతోంది.
తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాలకు ప్రయాణించడానికి ఈ మార్గమే ఉత్తమమని ఓ ప్రయాణికురాలు పేర్కొంది. ముంబై నుంచి నవీ ముంబై వెళ్లేవారితోపాటు లోణావాలా, పుణే, గోవా నుంచి వచ్చే వారికి కూడా ఈ మార్గం ఎంతో సులువుగా ఉంటుందని మరో ప్రయాణికుడు అభిప్రాయపడ్డాడు. దూరప్రాంతాల నుంచి వచ్చి లోకమాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ) వద్ద దిగిన ప్రయాణికులకు కూడా ఈ మార్గం ఓ వెసులుబాటుగా మారిం ది. తూర్పు, పశ్చిమ ప్రాంతాలకు ఎస్‌సీఎల్‌ఆర్ మీదుగా వెళ్లడంవల్ల సమయం ఆదా అవుతోంది.
అందుబాటులోకి ఎస్‌సీఎల్‌ఆర్ డబ్బు, సమయం ఆదా
Published Sun, Apr 20 2014 11:36 PM | Last Updated on Sat, Sep 2 2017 6:17 AM
Advertisement