ప్రజలకు సీఎం వివరణ ఇవ్వాలి: వడ్డే
విజయవాడ: సింగపూర్ కంపెనీలతో కుదర్చుకున్న ఎంవోయూపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మాజీఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. కోర్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతోందంటూ ప్రజలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తోందని ఆరోపించారు. క్యాపిటల్ డిజైన్లు ఖరారు కాకుండా నిర్మాణ సంస్థలతో టెండర్లు నిర్వహించకుండా కోర్ క్యాపిటల్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. స్టార్ట్ అప్ ఏరియాగా 1,691 ఎకరాల్లో అమరావతి డెవలప్‌మెంట్ పార్ట్నర్ (ఏడీపీ) అభివృద్ది పనులను మూడు దశల్లో చేపడతారని, అయితే దానిని మరుగుపరిచి ప్రభుత్వం కోర్ కార్యాలయాల నిర్మాణమని ప్రచారం చేయడమేంటని నిలదీశారు.
స్వదేశీ కంపెనీలు రాజధాని నిర్మాణంలో పాల్గొనకుండా నిబంధనలను మార్చారని ఆరోపించారు. సింగపూర్ కంపెనీలకు మాత్రమే అర్హత వుండేలా చట్టాలను సవరించారని వివరించారు. రాజధాని నిర్మాణాలను స్విస్ చాలెంజ్ కింద చేపట్టే వీలు లేదని తెలిపారు. స్టార్ట్ అప్ ఏరియా అభివృద్దికి ప్రభుత్వం పెట్టే ఖర్చు ఎంత? ప్రభుత్వం తీసుకునే వాటా ఎంత? అతి తక్కువ ఖర్చు పెట్టే సింగపూర్ సంస్థలకు 58 శాతం వాటా ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. దీనిలో భారీ అవినీతి జరిగే అవకాశం ఉందని, దీనిపై ముఖ్యమంత్రి ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.