కరీంనగర్ జిల్లాకు వాస్తుదోషం!
కరీంనగర్ కల్చరల్ : కరీంనగర్ జిల్లా విభజనతో వాస్తుముప్పు ఏర్పడిందని జ్యోతిష్య, వాస్తు ఆగమశాస్త్ర పండితులు నమిలకొండ రమణాచార్యస్వామి అన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను ఆయన కార్యాలయంలో మంగళవారం కలుసుకున్నారు. గతంలో జిల్లా నూరుశాతం వాస్తు ప్రకారం ఉండడంతోనే ఇక్కడ అభివృద్ధి సాధ్యమైందన్నారు. ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమం ఇక్కడ ప్రారంభం కావడం వల్లే రాష్ట్రం ఏర్పడిందని వివరించారు.
విభజన తర్వాత జిల్లాకు నైరుతిలో మానేరుడ్యామ్, పడమరలో మధ్యమానేరు ఉంటాయని, ఇవి దోషకరమని, ఉత్తరం, ఈశాన్య ప్రాంతాలు తగ్గాయని, జమ్మికుంట, హుజూరాబాద్ ప్రాంతాలతో తూర్పు, దక్షిణ, ఆగ్నేయాలు పెరిగాయని ఇవి శుభసూచకం కాదని, తద్వారా అరిష్టాలు కలిగే అవకాశముందని పేర్కొన్నారు.
వాస్తుదోష నివారణకు ఈశాన్య ప్రాంతాలలో చెరువు, కుంటల అభివృద్ధి, నైరుతిలో 108 ఫీట్ల ఎత్తులో అష్టదిక్పాలక సహిత వాస్తు స్తూపం నిర్మించాలని సూచించారు. గంగుల కమలాకర్ మాట్లాడుతూ ప్రజాక్షేమమే తనకు కావాలని, జిల్లా అభివృద్ధికి వాస్తుశాస్త్ర పద్ధతులు పాటిస్తామని వెల్లడించారు.