భద్రత పెంచండి
Published Wed, Oct 30 2013 1:18 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM
సాక్షి, న్యూఢిల్లీ: పండుగ సీజన్ కావడంతో మార్కెట్లలో పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రజలకు భద్రత పెంచాలని విధానసభ ప్రతిపక్ష నాయకుడు విజయ్‌కుమార్ మల్హోత్రా డిమాండ్ చేశారు. దేశంలో పలుచోట్ల ఉగ్రవాదుల కదలికలు ఎక్కువగా ఉంటున్నా దేశరాజధాని నగరంలో భద్రత గాలిలో దీపంగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో బాంబుపేలుళ్లు జరిగిన ఘటనలు నమోదవుతున్నా ప్రభుత్వం కళ్లు తెరవడం లేదన్నారు. ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఢిల్లీ నగరం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రతిరోజూ హెచ్చరిస్తున్నా ప్రయోజనం ఉండడం లేదన్నారు. దేశంలో ఉగ్రవాదుల దాడులకు ఢిల్లీ నగరం కేంద్రం అవుతోందన్నారు.
ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న ఉదాసీన ధోరణితో ప్రజ లకు ముప్పు పొంచి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్, నైజీరియా, పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్‌కి చెందిన లక్షల మంది ఢిల్లీలో అక్రమం గా నివసిస్తున్నారన్నారు. నగరంలో జరుగుతున్న ఎన్నో నేరాల్లో వీరిపాత్ర ఉంటుందన్నారు. ఇటీవల సైబర్ క్రైంలలో నైజీరియన్ల పాత్ర అధికంగా ఉన్నట్టు రుజువైందన్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ ఈ అంశంలో జోక్యం చేసుకుని భద్రత కట్టుదిట్టం చేయకపోతే పాట్నాలో జరిగిన ఉగ్రదాడులు ఢిల్లీలోనూ జరుగుతాయని అనుమానం వ్యక్తం చేశారు.
చుక్కలనంటుతున్న ధరలతో జనం ఉక్కిరిబిక్కిరి: గోయల్
పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ధరలతో నగరంలో పండుగ శోభ కనిపించడం లేదని విజయ్‌గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో ఈ దీపావళి సామాన్యుల ఇళ్లలో చీకట్లే మిగిల్చేలా ఉందన్నారు. ఉల్లిధరలు ఇప్పటికే కంటనీరు తెప్పిస్తున్నాయన్నారు. పెట్రోలు,పాలు,పప్పులు, ఆటా,బియ్యం తదితరాలు రేట్లు రెట్టింపు అయ్యాయన్నారు. కూరగాయల ధరలు నెల రోజుల్లో 200 నుంచి 300 శాతం పెరిగాయని పేర్కొన్నారు.
‘ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కంటితుడుపుగా ఉన్నాయి. కేవలం 350 సఫల్ కేంద్రాల్లో, 150 మొబైల్‌వ్యాన్లలో ఉల్లి సరఫరా చేస్తే సమస్య పరిష్కారమవుతుందన్నట్టు సీఎం మాట్లాడుతున్నారు. ఢిల్లీలోని కోటి 67 లక్షల మందికి ఎలా చేరవేస్తారు. మొబైల్‌వ్యాన్లు లెక్కకు మాత్రమే తిరుగుతున్నాయి పేదలకు ఎలాంటి ఉపయోగం లేదు. సఫల్ కేంద్రాల్లోనూ పాడైపోయిన ఉల్లినే విక్రయిస్తున్నారు ’అని గోయల్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగా దేశవ్యాప్తంగా ఉల్లి కొరత నెలకొందని విమర్శించారు. దేశీయ ఉల్లి రూ.40-45కే అందుబాటులో ఉండగా బంగ్లాదేశ్ నుంచి వచ్చే ఉత్పత్తులను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారన్నారు.
Advertisement
Advertisement