కెప్టెన్‌కు ఎసరు! | Vijayakanth to presidential threat | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌కు ఎసరు!

Published Sun, Apr 10 2016 2:45 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

కెప్టెన్‌కు ఎసరు!

కెప్టెన్‌కు ఎసరు!

నేడు తిరుగుబాటుదారుల సమావేశం
డీఎండీకే అత్యవసర సమావేశం
పోటాపోటీగా బలనిరూపణ
డీఎండీకేలో ముదురుతున్న ముసలం

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: డీఎండీకేలో ఇటీవల పుట్టిన ముసలం రోజురోజుకూ ముదురుతోంది. ఏకంగా పార్టీ అధ్యక్షులు విజయకాంత్ పదవికే ఎసరు పెట్టేందుకు తిరుగుబాటు అభ్యర్థులు, తన పరువును, పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు కెప్టెన్ వేర్వేరుగా ఆదివారం సమావేశం అవుతున్నారు. పొత్తులతో బలపడాల్సిన డీఎండీకే అనూహ్యరీతిలో బలహీనపడిపోయింది. డీఎంకేతో పొత్తుకే ఎక్కువశాతం మొగ్గుచూపిన ఎమ్మెల్యేలు, నేతలను కాదని ప్రజా సంక్షేమ కూటమితో జతకట్టడం ఆ పార్టీలో చిచ్చురేపింది.
 
 అంతే ఎన్నికల వేళ ఏకతాటిపై నిలవాల్సిన నేతలు చిన్నాభిన్నమైనారు. అన్నాడీఎంకే ప్రభుత్వంతో విభేదించి ఎక్కువ నష్టపోయినదని తమ పార్టీనేనని, ఇటువంటి దుస్థితిలో డీఎంకేతో పొత్తుపెట్టుకోకుండా ప్రజా సంక్షేమ కూటమిలో చేరిపోవడాన్ని తాము సహించలేమంటూ నలుగురు ఎమ్మెల్యేలు, కొందరు ప్రధాన నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పొత్తు నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా విజయకాంత్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే వీరి సూచనను విజయకాంత్ వినిపించుకోలేదు.  పార్టీపై విజయకాంత్ పెత్తనానికి ఏనాడో కాలం చెల్లింది, ఆయన సతీమణి ప్రేమలత నేడు అంతాతానై నడిపించడం సహించలేమని అసంతృప్తివాదులు మీడియాకు ఎక్కారు.
 
 ఈ పరిణామంతో ఉగ్రుడైన విజయకాంత్ వారందరినీ సస్పెండ్ చేశారు. అయితే తిరుగుబాటు దార్లు సైతం సస్పెన్షన్ కోసమే ఎదురుచూసినట్లుగా వ్యవహరించి కెప్టెన్ తీరుపై మరింత రెచ్చిపోయారు. అయితే వీరిలో కొందరు తాము విజయకాంత్ తీరును విభేదించినా పార్టీలోనే కొనసాగుతామని పేర్కొన్నారు. అంటే మరో వర్గంగా మారేందుకు సిద్దమైనట్లు ప్రకటించారు. డీఎండీకేలో కుమ్ములాటలు మిన్నంటిన నేపధ్యంలో అస్మతీయులు, తస్మదీయులు ఆదివారం వేర్వేరుగా బలనిరూపణ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
 
 నేడు చెన్నైలో తిరుగుబాటుదారుల సమావేశం
 డీఎండీకే  తిరుగుబాటు నేత, ఎమ్మెల్యే చంద్రకుమార్ ఆదివారం భారీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. చెన్నై టీన గర్ లోని త్యాగరాజ కల్యాణమండపంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి అసంతృప్తివాదులు హాజరవుతున్నట్లు సమాచారం. విజయకాంత్ నిర్ణయాలను పార్టీలోని 90శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తిరుగుబాటుదారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో విజయకాంత్ పనితీరు కార్యకర్తల మనోభావాలకు విరుద్దంగా సాగుతోందని విమర్శిస్తున్నారు.
 
  డీఎండీకేలో విజయకాంత్ కంటే తనకే ఆదరణ ఎక్కువ ఉందని, ఎక్కువశాతం కార్యకర్తలు తన మాటకే కట్టుబడి ఉన్నారనే వాదనతో చంద్రకుమార్ బలనిరూపణకు సిద్దం అవుతున్నారు. అంతేగాక ఆదివారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తామని తిరుగుబాటుదారులు తెలిపారు. చంద్రకుమార్ వాదనకు ఆదివారం నాటి సమావేశంలో బలం చేకూరిన పక్షంలో ప్రజాస్వామ్యతీరులో డీఎండీకే అధ్యక్షునిగా ఎన్నికయ్యేందుకు చంద్రకుమార్ ప్రయత్నించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇదే జరిగితే కెప్టెన్ అధ్యక్ష పదవికే ముప్పువాటిల్ల వచ్చు.
 
 నేడు కెప్టెన్ సర్వసభ్య సమావేశం
 ఇదిలా ఉండగా, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ సైతం ఆదివారం ఉదయం కోయంబేడులోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 9.30 గంటలకు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. సర్వసభ్య సమావేశం, కార్యవర్గ సమావేశాన్ని వరుసగా నిర్వహించడం ద్వారా తనవారెవరు, చంద్రకుమార్ వైపు ఎవరో తేల్చుకోనున్నారు. ఆదివారం ఉదయం చెన్నై నగరంలో ఒకేసారి ఒకవైపు విజయకాంత్, మరోవైపు తిరుగుబాటుదారుల సమావేశం ఏర్పాటు కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement