సింగపూర్‌కు కెప్టెన్
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. ఆయా రాజకీయ పార్టీలు తమ దైన శైలిలో వ్యూహ రచనల్లో ఉన్నాయి. అందరికంటే ముందుగా అన్నాడీఎంకే ఎన్నికల పనుల్లో దూసుకెళుతోంది. ఇక తమ తమ నేతృత్వంలో కూటమి లక్ష్యంగా డీఎంకే, బీజేపీ, కాంగ్రెస్‌లు వేర్వేరుగా పావులు కదుపుతున్నాయి. వీరందరి దృష్టి ప్రధాన ప్రతిపక్ష నేత విజయకాంత్ మీద పడింది. ఆయన్ను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా తీవ్రంగా కుస్తీలు పడుతున్నారు. బీజేపీతో పొత్తు దాదాపుగా ఖరారైనట్టునన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రెండు మూడు రోజుల్లో తమ పొత్తును ఆయన ఖరారు చేయనున్నారన్న ప్రచారం సాగుతోంది. కమలంతో కలసి అడుగులు వేయడానికి విజయకాంత్ సిద్ధం అవుతున్నారన్న సమాచారంతో డీఎంకే వర్గాలు మేల్కొన్నాయి. ఫార్వర్డ్ బ్లాక్ నేత సంతానం ద్వారా విజయకాంత్‌తో రాయబారం సాగించారు. ఆదివారం ఉదయం విజయకాంత్, సంతానం భేటీ అయ్యారు. ఈ భేటీ విషయాలు గోప్యంగానే ఉన్నా, హఠాత్తుగా విజయకాంత్ సింగపూర్ బయలుదేరి వెళ్లడం చర్చకు దారి తీసింది.
పయనం: విజయకాంత్ సింగపూర్ పయనం సమాచారంతో మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియా పడిగాపులు గాచింది. అంతర్జాతీయ టెర్మినల్ నాలుగో గేట్ గుండా ఆయన లోనికి వెళతారని సర్వత్రా భావించారు. అయితే, చడీ చప్పుడు కాకుండా ఒకటో గేట్‌లో తన సతీమణి ప్రేమలతతో కలసి విజయకాంత్ సింగపూర్‌కు జెట్ ఎయిర్ వేసి విమానంలో బయలు దేరి వెళ్లారు. మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆయన విమానం టేకాఫ్ అయింది. అయితే, ఉన్నట్టుండి విజయకాంత్ సింగపూర్ వెళ్లడంలో ఆంతర్యమేమిటోనన్న ప్రశ్న బయలు దేరింది. కొందరైతే పొత్తుల చర్చ సింగపూర్ వేదికగా సాగబోతోందని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కెప్టెన్ డిమాండ్లకు సింగపూర్ వేదికగా బీజేపీ తలొగ్గొచ్చేమోనని చమత్కరిస్తున్నారు.
పొత్తుల బేరం: డీఎండీకే వర్గాలు మాత్రం కెప్టెన్ పర్యటన వ్యక్తిగతం అంటున్నారుు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాకే పొత్తులపై తేల్చేందుకు తమ నేత విజయకాంత్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు.
చెన్నైలో ఆయన ఉన్నా, ఢిల్లీ వెళ్లినా పొత్తు కోసం పాకులాడుతున్నారని, బేరాలు పెడుతున్నారంటూ ప్రచారం సాగుతుండటం తమ నేతకు నచ్చడం లేదని చెబుతున్నారు. తమ నేతను ఇతర పార్టీల నాయకులెవ్వరు కలవనప్పటికీ, ఆయన్ను కలిసినట్టుగా పొత్తులు ఖరారైనట్టుగా ప్రచారం జరుగుతుండటాన్ని ఆయన తప్పుబడుతున్నారని పేర్కొంటున్నారు. ఇక్కడుంటే, రోజుకో కథనాలు అల్లుతున్నారని, అందువల్లే కొన్నాళ్లు సింగపూర్‌లో ఉండేందుకు నిర్ణయించారని చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయంలో తమ నేత చెన్నైకు తిరుగు పయనం అవుతారని డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో పొత్తులపై నియమించిన కమిటీ అంతలోపు నిర్ణయం తీసుకుంటుందని, తమ నేత వచ్చాకే పొత్తు ఖరారు ప్రకటన వెలువడుతుందని పేర్కొనడం గమనార్హం.