ఆర్కేనగర్‌లో విజయశాంతి | Vijayashanti supporting dinakaran in rk nagar by elections | Sakshi
Sakshi News home page

ఆర్కేనగర్‌లో విజయశాంతి

Published Sat, Apr 8 2017 3:28 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

Vijayashanti supporting dinakaran in rk nagar by elections

► దినకరన్ కు మద్దతు
► కొనసాగుతున్న ఘర్షణలు
► వాహనాల తనిఖీలో 12 మంది అరెస్ట్‌


సాక్షి ప్రతినిధి, చెన్నై : ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్న దినకరన్ తాజాగా ప్రముఖ సినీ నటి విజయశాంతిని ప్రచారంలోకి దించారు. అన్ని పార్టీల అభ్యర్థులు తమ నేతలతో శుక్రవారం ప్రచారం నిర్వహించగా, దినకరన్ కు మద్దతుగా ప్రచారం చేస్తున్న విజయశాంతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు ఎన్నికల్లో సహజంగా డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్యనే ప్రధాన పోటీ. అయితే జయలలిత మరణం, అన్నాడీఎంకే రెండుగా చీలిపోవడంతో సహజస్థితి మాయమై కొత్త పోటీలు పొద్దుపొడిచాయి. ఆర్కేనగర్‌లో డీఎంకే అభ్యర్థి పోటీచేస్తున్నా అన్నాడీఎంకే నుంచి రెండు వైరి వర్గాలే ఒకరిపై ఒకరు పట్టుదలతో ఉన్నారు.

ఆర్కేనగర్‌లో గెలుపు జీవన్మరణ సమస్యగా భావిస్తున్న దినకరన్  తమిళ సినీ రంగానికి చెందిన ఎందరో తారలను ప్రచారంలోకి దించారు. తాజాగా దినకరన్  తరఫున విజయశాంతి రంగ ప్రవేశం చేశారు. ఆర్కేనగర్‌ నియోజకవర్గ పరిధిలో తెలుగు ప్రజలు ఎక్కువగా నివసించే కొరుక్కుపేట, శాస్త్రినగర్, కామరాజనగర్, తదితర ప్రాంతాల్లో విజయశాంతి ప్రచారం నిర్వహించారు. ఆమె వెంట తిరువళ్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి బీవీ.రమణ, అన్నాడీఎంకే కార్యదర్శి బలరామన్, గుమ్మిడిపూండి జిల్లా కార్యదర్శి విజయకుమార్, పూందమల్లి ఎమ్మెల్యే ఏలుమలై ఉన్నారు. ప్రచార సమయంలో తెలుగు ప్రజలు తమ అభిమాన నటి విజయశాంతికి ఘన స్వాగతం పలకడంతో పాటూ ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.

ఘర్షణల నగర్‌:ఆర్కేనగర్‌లో ఎన్నికల ప్రచారం రానురాను ఘర్షణలకు దారితీస్తోంది. ధన వర్షం కురిపించైనా గెలుపొందాలని ఒక అభ్యర్థి, ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలని ప్రత్యర్థుల ప్రయత్నాలతో పలువురు గాయపడుతున్నారు. ఓ వర్గం వ్యక్తులు  రెండు రోజుల కిందట నగదు పంచుతుండగా అడ్డుకున్న ఇద్దరు డీఎంకే కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. కొరుక్కుపేట 41వ వార్డులో డీఎంకే కార్యకర్తలు తమ అభ్యర్థి మరుదు గణేష్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుండగా అన్నాడీఎంకే ఆర్కేనగర్‌ కార్యదర్శి సంతానం, వార్డు కార్యదర్శి రవి నేతృత్వంలో 50 మంది యువకులు దాడులు చేశారు.

ఈ దాడుల్లో తంగరాజ్‌(29), బాబు(31) గాయపడ్డారు. అలాగే, నేతాజీ నగర్‌లో గురువారం రాత్రి పన్నీర్‌సెల్వం, దినకరన్  వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. ఈ దాడుల్లో మాజీ ఎమ్మెల్యే కరుప్పయ్యా తదితర 8మందితో పాటు పోలీసులు గాయపడ్డారు. ఇందుకు సంబంధించి పన్నీర్‌ వర్గానికి చెందిన వారిపై కేసులు నమోదయ్యాయి. తమది ధర్మయుద్ధం, గెలిచే తీరుతామని ఈ సందర్భంగా పన్నీర్‌సెల్వం ధీమా వ్యక్తం చేశారు. ప్రజల నుంచి  దోచుకున్న సొమ్మును దినకరన్  పంచుతున్నారని దీప ఎద్దేవా చేశారు. డీఎంకే అభ్యర్థి తరఫున స్టాలిన్  వీధి వీధిన తిరుగుతూ ప్రచారం చేశారు.

పన్నీర్‌ వర్గీయులు జయలలిత భౌతిక కాయాన్ని పోలిన నమూనా శవపేటికతో ప్రచారం చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎన్నికల కమిషన్  సైతం ఈ తరహా ప్రచారాన్ని  ఆక్షేపించింది. దినకరన్  ఓపెన్  టాప్‌ జీపులో తిరుగుతూ ఓటర్లను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మధుసూధనన్ తరఫున పన్నీర్‌సెల్వం ప్రచారం చేయగా, ఆర్కేనగర్‌లో పోటీచేస్తున్న నలుగురు స్వతంత్ర అభ్యర్థులు పన్నీర్‌సెల్వంకు మద్దతు తెలిపారు. మధుసూధనన్  గెలుపునకు పాటుపడతామని వారు చెప్పారు.

వాహనాల తనిఖీలో 12 మంది అరెస్ట్‌: ఆర్కేనగర్‌ ప్రజలను మభ్యపెట్టేందకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారనే సమాచారంతో ఫ్లయింగ్‌ స్క్వాడ్, పోలీసులు వాహనాల తనిఖీ ముమ్మురం చేశారు. శుక్రవారం ఉదయం పుదువన్నార్‌పేట్టై, దేశీయనగర్, ఇందిరానగర్, శివన్ నగర్‌ తదితర ప్రాంతాల్లో ఓటర్లకు నగదు పంచుతున్నట్లు అధికారులకు సమాచారం అందింది.

ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు, పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని ఓటర్లకు నోట్లు పంచుతున్న తిరుపూరుకు చెందిన తంగరాజ్, బాబు, ముసిరి సెంథిల్, జయశీలన్, పుదూర్‌ రామచంద్రన్  తదితర 9మందిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి  రూ.1.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తండయార్‌పేట తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి డీఎంకేకు చెందిన ముగ్గురిని అరెస్ట్‌ చేసి రూ.27వేలు స్వాధీనం చేసుకున్నారు.

ఇదిలా ఉండగా, తనిఖీ అధికారులను ఇంట్లోకి రాకుండా నిలువరించేందుకు ఒక మహిళ బహిరంగంగా వివస్త్రగా మారగా అందరూ కంగారుపడ్డారు. ఆ మహిళ నోటిమాటల ధాటికి అధికారులు వెళ్లిపోయారు. ఆర్కేనగర్‌లో అక్రమమార్గంలో గెలవాలని ప్రయత్నిస్తున్న దినకరన్ ను ఎన్నికల్లో పోటీచేయకండా అనర్హత వేటు వేయాల్సిందిగా అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళ పుష్ప ఢిల్లీలో ఎన్నికల కమిషన్ కు వినతిపత్రం సమర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement