కష్టాల్ని విజయాలుగా మలుచుకుందాం
Published Fri, Aug 23 2013 4:50 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
సాక్షి, చెన్నై: ‘కష్టకాలంలో ఉన్నాం...అన్నింటినీ అధిగమిద్దాం... కష్టాల్ని విజయాలుగా మలుచుకుందాం...అండగా ఉండండి’ అని పార్టీ కార్యకర్తలకు డీఎండీకే అధినేత విజయకాంత్ లేఖ రాశారు. తన పుట్టిన రోజును పురస్కరించుకుని వంద మంది వికలాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. తమిళ రాజకీయాల్లో రాష్ట్రేతరులు అనాది నుంచి తమ హవా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు వారి ప్రస్థానం లేకుండా ఇంతవరకు ప్రభుత్వం ఏర్పాటైన దాఖలు లేవు. 60 ఏళ్ల రాష్ట్ర రాజకీయాల్లో మార్పును కోరుతూ ప్రభుత్వ పగ్గాలు చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కింగ్ మేకర్‌గా నిలిచిన తెలుగువాడే విజయ్‌కాంత్. కరుపు ఎంజీఆర్ (నలుపు ఎంజీఆర్)గా, కెప్టెన్, పురట్చి కలైంజ్ఞర్ (విప్లవ నటుడు)గా మదురైలో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన విజయ్‌రాజ్ నాయుడు తమిళ తెరపై తనదైన గుర్తింపుతో విజయ్‌కాంత్‌గా మెరిశారు.
అలాగే రాష్ట్ర రాజకీయాలను ప్రక్షాళన చేస్తానంటూ ఏకంగా పార్టీనే ప్రారంభించిన విషయం తెలిసిందే. డీఎండీకే (దేశీయ ముర్పోకు ద్రావిడ కళగం) పార్టీని ఏర్పాటు చేసిన ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి తన సత్తాను చాటుకున్నారు. పేదరికం, అవినీతి నిర్మూలన, ఎంజీఆర్ ఆశయ సాధన అజెండాగా చేసుకుని రాజకీయాల్లో దూసుకొచ్చిన విజయకాంత్ ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించారు. పార్టీ ఆవిర్భావంతో ఎనిమిదేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. ఆయన ప్రతి ఏటా తన జన్మదినాన్ని పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.
గత ఏడాది ఆయన పుట్టిన రోజు వివాదాలకు దారి తీసింది. ఒక్కో జిల్లాలోని పేదలకు రూ.25 లక్షల విలువైన సహాయకాలు పంపిణీ చేస్తూ నెల రోజులు జన్మదినాన్ని జరుపుకున్నారు. అలాగే ఏడాది పొడవునా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో ఏడాది కాలంగా డీఎండీకే కష్టాల్ని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ నుంచి వలసలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ విజయకాంత్ పుట్టిన తేదీ రానే వచ్చింది. ఆగస్టు 25న ఆయన 59వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కార్యకర్తల్ని ఉత్సాహ పరుస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా తన పుట్టిన రోజు వేడుకలకు పిలుపునిస్తూ లేఖ రాశారు.
ధైర్యంగా ముందుకు నడుద్దాం
తన జన్మదినాన్ని పేదరిక నిర్మూలన దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందేనని విజయకాంత్ పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో గుర్తు చేశారు. ప్రతి ఏటా పేదల్ని ఆర్థికంగా ఆదుకునే విధంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. వృద్ధాశ్రమాలు, పిల్లల సంరక్షణా కేంద్రాలను ఆదుకుంటున్నామని, ఉచిత కల్యాణ మండపాలు నిర్మించామని, విద్యార్థులకు చేయూత ఇచ్చామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 చోట్ల ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే శిశు సంరక్షణ లక్ష్యంగా ఆడ శిశువుల పేరిట డిపాజిట్లు చేశామని తెలిపారు. గత ఏడాది ఒక్కో జిల్లాకు రూ.25 లక్షలు చొప్పున పేదలకు సహాయకాలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. తాను సినీ రంగంలో ఉన్నప్పటి నుంచి జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నానని గుర్తు చేశారు.
కొంతకాలంగా కష్టాలు, కుట్రలను ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తనపై కేసుల మోత మోగించారని, కోర్టుల చుట్టూ తిప్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆవిర్భావంతో తన మీద బాధ్యతలు పెరిగాయని, కార్యకర్తలు, నాయకులు, ప్రజల అండదండలతో ప్రధాన ప్రతి పక్షంగా అవతరించామన్నారు. త్వరలో మహా శక్తిగా డీఎండీకే రూపుదిద్దుకుంటుందని వివరించారు. కష్టాల్ని అధిగమించాల్సిన సమయం ఇదేనన్నారు. అందరూ ధైర్యంగా ముందుకు సాగుతూ కష్టాల్ని విజయాలుగా మలుచుకునే విధంగా శ్రమించాల్సి ఉందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కుట్రలు, కుత్రంతాలను తిప్పికొట్టి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా శ్రమిద్దామని సూచించారు. ఈ ఏడాది తన జన్మదినాన్ని పురస్కరించుకుని వంద మంది వికలాంగులకు మూడు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేయనున్నామని ప్రకటించారు. అలాగే ఎంజీఆర్ బధిర పాఠశాలకు రూ.50 లక్షలు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు అందరూ పేదరిక నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ వంతు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement