పరువు నష్టం దావా కేసుల నుంచికెప్టెన్‌కు ఊరట | Defamation cases From relief Vijaykanth | Sakshi
Sakshi News home page

పరువు నష్టం దావా కేసుల నుంచికెప్టెన్‌కు ఊరట

Published Wed, Aug 14 2013 3:54 AM | Last Updated on Fri, Sep 1 2017 9:49 PM

Defamation cases From relief Vijaykanth

సాక్షి, చెన్నై: విజయకాంత్ గత ఏడాది ఆగస్టులో తన జన్మదినాన్ని రోజుకో జిల్లాలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేదికలెక్కి ప్రసంగాలిచ్చారు. ముఖ్యమంత్రి జయలలిత, ప్రభుత్వ పనితీరుపై ఆరోపణలు సంధించారు. ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లా కోర్టుల్లో పరువు నష్టం దావాలు నమోదయ్యాయి. విచారణ నిమిత్తం కెప్టెన్ స్వయంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. కొన్ని కోర్టుల విచారణకు డుమ్మా కొట్టడంతో అరెస్టు వారెంట్లు సైతం జారీ అయ్యాయి. ఈ కేసుల ఆయన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విచారణకు స్వయంగా హాజరుకావడం నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కెప్టెన్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
 
 హాజరు కానక్కర్లేదు: ముఖ్యమంత్రి జయలలిత కొడనాడులో కూర్చుంటే ప్రజా సమస్యలు పరిష్కరించేదెవరని తాను ప్రశ్నించానని కెప్టెన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రభుత్వ తప్పుల్ని ఎత్తిచూపే హక్కు తనకు ఉందన్నారు. అయితే తానేదో ఆరోపణలు, విమర్శలు చేసినట్లు పలు జిల్లా కోర్టుల్లో పరువు నష్టం దావాలు దాఖలయ్యాయని వివరిం చారు. ప్రస్తుతం తిరువళ్లూరు, శివగంగై, తిరునల్వేలి కోర్టుల్లో విచారణ నిమిత్తం స్వయంగా హాజరుకావాల్సిన పరిస్థితి ఉందన్నారు. తన మీద పరువు నష్టం దావాల్ని స్వయంగా ముఖ్యమంత్రి జయలలిత వేయూలేగానీ ఆమె తరపు ప్రభుత్వ న్యాయవాది కాదని పేర్కొన్నారు. 
 
 పధాన ప్రతిపక్ష నేతగా ఉన్న తన మీద పరువు నష్టం దావాల్ని వేసే అధికా రం ప్రభుత్వ న్యాయవాదికి లేదని తెలియజేశారు. ఈ దృష్ట్యా ఆ కేసుల విచారణ నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని విన్నవించారు. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు ధనపాలన్, సీపీ సెల్వన్ నేతృత్వంలోని బెంచ్ మంగళవారం విచారించింది. విజయకాంత్ తరపున న్యాయవాది బాలాజీ వాదనలు విన్పించారు. వాదనల అనంతరం విజయకాంత్‌కు ఊరట కలిగిస్తూ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. తిరువళ్లూరు, తిరునల్వేలి, శివగంగై కోర్టులకు విచారణ నిమిత్తం స్వయంగా హాజరు కావాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే విజ యకాంత్ పిటిషన్‌కు సంబంధించి వారంలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement