వాకింగ్‌తో ప్రచారం
సాక్షి, చెన్నై: తండ్రిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు తనయుడు పడుతున్న కష్టం ఇది. మనకు.. మనమే అంటూ రాష్ట్రాన్ని చుట్టొచ్చిన ఈ తనయుడు అధికార పగ్గాలు లక్ష్యంగా రేయింబవళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ తనయుడే డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్. వినూత్న బాణీతో ప్రచారంలో దూసుకెళ్తోన్న స్టాలిన్ మందీమార్బలం, కమాండోల భద్రతా వలయం కూడా లేకుండా సాధారణ వ్యక్తిగా వాకింగ్‌తో ప్రజల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. ఆయన్ను గుర్తు పట్టిన వాళ్లు మనలో ఒక్కడూ అంటూ నినాదించడం మొదలెట్టారు. ఇందుకు తిరుచెందూరు వేదికగా నిలిచింది.
అధికార పగ్గాల్ని చేపట్టి తీరాలన్న కాంక్షతో డీఎంకే వర్గాలు ఉరకలు పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రథముడిగా డీఎంకే దళపతి స్టాలిన్ ఉన్నారు. అధినేత కరుణానిధి ఓ వైపు, చెల్లెమ్మ కనిమొళి మరో వైపు ప్రచారంలో ఉరకలు తీస్తున్నా, దళపతి శైలి మాత్రం వినూత్నంగా సాగుతున్నది. మనకు..మనమే అంటూ స్టైలీష్ స్టాలిన్‌గా మారిన ఈ దళపతి ఎన్నికల ప్రచారంలో సమయానికి, సందర్భానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు.
రోడ్ షో సాగుతున్నా, చటుక్కున వాహనం దిగేయడంతో కాసేపు నడకతో జనాన్ని పలకరించడం, చిన్న దుకాణాల్లో బజ్జిలు, బిస్కెట్లు ఆరగించడం, టీ కాఫీలతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో సోమవారం వేకువ జామున వాకింగ్ రూపంలో ఓటర్లను పలకరించే యత్నం చేసి స్టాలిన్ సఫలీకృతులు అయ్యారు. తిరుచెందూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్టాలిన్ ఉదయాన్నే హంగు ఆర్భాటాలు, మంది మార్భలం, కమాండో బలగాల భద్రత కూడా లేకుండా సాధారణ వ్యక్తిగా బయటకు వచ్చేయడం విశేషం.
అక్కడి వీధుల్లో వాకింగ్ చేస్తూ, తిరుచెందూరు బీచ్ వైపుగా కదిలారు. కాసేపు బీచ్‌లో సముద్రపు గాలిని ఆస్వాదించిన స్టాలిన్ తిరిగి హోటల్‌కు వెళ్లడానికి గంట సమయం పట్టిందటా..!. ఇందుకు కారణం స్టాలిన్‌ను గుర్తు పట్టిన జనం మనలో ఒక్కడూ అని నినాదిస్తూ పలకరింపుల్లో దిగడం గమనార్హం. ఆలయ వీధుల్లో వాకింగ్‌తో మహిళల్ని , కార్మికుల్ని పలకరిస్తూ, రోడ్డుపై ఉన్న దుకాణంలో కొంబరి బోండాను తాగి, అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ హోటల్‌కు చేరడం విశేషం. అయితే, తండ్రిని సీఎం కుర్చీలో కూర్చేబెట్టేందుకు వారసుడు పడుతున్న పాట్లు, చేస్తున్న ఫీట్లకు ఏ మేరకు ఓట్లు రాలుతాయో ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.