నెరూల్‌లో నీటికి కటకట | water problems in nerul | Sakshi
Sakshi News home page

నెరూల్‌లో నీటికి కటకట

Published Fri, Dec 27 2013 12:44 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

water problems in nerul

సాక్షి, ముంబై: నెరూల్ రైల్వే స్టేషన్‌లో తాగునీరు సౌకర్యం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రైల్వే స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతమైన మాథేరాన్‌ను సందర్శించేందుకు రోజుకు కొన్ని వేల మంది ప్రయాణికులు వస్తుంటారు. ఇక్కడి నుంచి టాయ్ ట్రైన్‌ను ఆశ్రయించి మాథేరాన్ వెళుతుంటారు. గత మూడు రోజుల నుంచి ఇక్కడ తాగునీరు లభించక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ స్టేషన్‌కు మంచి నీరు సరఫరా చేస్తున్న స్థానిక గ్రామ పంచాయతీ ఇటీవల ధరను పెంచడంతో అందుకు సెంట్రల్ రైల్వే ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో సదరు గ్రామ పంచాయతీ నెరూల్ స్టేషన్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది.


 కాగా, నెరూల్ గ్రామ పంచాయతీతో మంచి నీటి సరఫరా కోసం మూడేళ్ల కాంట్రాక్ట్‌ను సెంట్రల్ రైల్వే  కుదుర్చుకుంది. ఇందుకుగాను సెంట్రల్ రైల్వే రూ.1.71 లక్షలు చెల్లించింది. అయితే ఈ కాంట్రాక్ట్ గడువు పూర్తి అవడంతో సదరు గ్రామ పంచాయతీ మంచి నీటి సరఫరా కోసం రూ.3.42 లక్షలను పెంచింది. దీంతో సెంట్రల్ రైల్వే పెంచిన మొత్తాన్ని అంగీకరించలేదు. దీంతో గ్రామ పంచాయతీ ఈ స్టేషన్‌కు నీటి సరఫరాను నిలిపివేసింది. ఈ విషయమై సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ...ఈ స్టేషన్‌కు అత్యంత సమీపంలో ఉన్న ఓ బావి నుంచి స్టేషన్ వరకు మంచి నీటి పైప్‌లైన్‌లను అమర్చామన్నారు. దీనిద్వారా నీటి సరఫరా చేస్తున్నామని సెంట్రల్ రైల్వే పీఆర్వో ఎ.కె.సింగ్ తెలిపారు.
 కాగా, మాథేరాన్‌ను సందర్శించేందుకు వేసవి కాలంతో పాటు చలి కాలంలో రోజుకు దాదాపు 20,000 మంది పర్యాటకులు నెరూల్‌కి వస్తుంటారు. ఈ స్టేషన్‌లో టాయ్ ట్రైన్ సేవల కోసం రోజుకు రూ.25,000 టికెట్లను  సెంట్రల్ రైల్వే విక్రయిస్తోంది. అయితే సెలవులను పురస్కరించుకొని టికెట్ ధరలను పెంచుతోంది. కాగా, ఆరు టాయ్ ట్రైన్‌లు మాథేరాన్ గుట్టపై ఉన్న అమన్ లాడ్జీ వరకు సేవలను అందిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు టాయ్ ట్రైన్ సేవల వల్ల  సెంట్రల్ రైల్వేకు రూ.1.56 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే గతంలో ఇదే సమయంలో కేవలం రూ.53 లక్షలను మాత్రమే సెంట్రల్ రైల్వే ఆదాయంగా పొందింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement