మాకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోంది
బెంగళూరు: కావేరి జలాల విషయంలో తమకు చాలాకాలంగా అన్యాయం జరుగుతోందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు ఆరు రోజుల పాటు కావేరి జలాలను విడుదల చేశామని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశాన్ని పాటించడం ఇబ్బందికరమైనా, తాము ఇప్పటికీ తీర్పుకు కట్టుబడిఉన్నామని తెలిపారు. కర్ణాటకలో తాగునీటికి సమస్య ఏర్పడినా, కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేశామని చెప్పారు.
కావేరి జలాల వివాదంతో కర్ణాటక, తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో సిద్ధరామయ్య మంగళవారం అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి తాజా పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్ణాటకలో పరిస్థితి ప్రస్తుతం అదుపులో ఉందని సిద్ధరామయ్య చెప్పారు. ప్రజలందరూ సంయమనంతో ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని సూచించారు.
'కావేరి వివాదంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశాను. ప్రధానిని కలిసేందుకు వెంటనే అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరాను. రేపు నేను ఆయనతో కలిసే అవకాశం ఉంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా పిలిచి చర్చించాల్సిందిగా మోదీనికి విజ్ఞప్తి చేశా. ఏ సమస్యకైనా హింసే పరిష్కారం కాదు. న్యాయ వ్యవస్థపై నమ్మకముంది' అని సిద్ధరామయ్య అన్నారు.
కావేరి వివాదం కారణంగా తమిళనాడులో కన్నడిగులపై, కర్ణాటకలో తమిళులపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరుతో పాటు మైసూర్, మండ్యా ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బెంగళూరులో తమిళనాడుకు చెందిన బస్సులు, లారీలు, ఇతర వాహనాలను ఆందోళనకారులు దహనం చేశారు. బస్సు డిపోలో ఆపిన 40 ఓల్వో బస్సులకు నిప్పంటించారు. సరిహద్దుల్లో తమిళనాడుకు వెళ్లే వాహనాలను అడ్డుకున్నారు. తమిళుల ఆస్తులపైనా దాడికి పాల్పడ్డారు. పోలీసుల కాల్పుల్లో బెంగళూరులో ఓ వ్యక్తి మరణించాడు.