మాకు తాగేందుకు కూడా నీళ్లుండవు: సీఎం
తమిళనాడుకు ప్రతిరోజూ 15వేల క్యూసెక్కుల నీళ్లు ఇస్తూనే ఉంటే.. ఇక మీదట బెంగళూరు నగర వాసులకు తాగడానికి నీళ్లుండవని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి తెలిపారు. కావేరీ నదీ జలాల సంక్షోభంపై ఆయన ప్రధానికి రెండు పేజీల లేఖ రాశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, తనకు మీ సమక్షంలో ఒక సమావేశం ఏర్పాటుచేయాలని అందులో కోరారు. తమిళనాడుకు నీటి విడుదల వల్ల కావేరీ పరివాహక ప్రాంతంలో రైతులకు కూడా తీవ్ర కష్టాలు తప్పవన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ మీద కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, దానివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయొద్దని బీజేపీ రాష్ట్ర శాఖ చెబుతోందని కూడా ఆయన ఆ లేఖలో తెలిపారు. అయితే.. రాష్ట్రానికి సంబంధించి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందువల్ల తాను మాత్రం సుప్రీంకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా పాటిస్తున్నానని అన్నారు. తమిళనాడు పరిస్థితి కర్ణాటక కంటే చాలా మెరుగ్గా ఉందని, మెట్టూరు రిజర్వాయర్‌లో నీటి నిల్వలు బాగున్నాయని, ఆ రాష్ట్ర ఈశాన్య ప్రాంతంలో కూడా వర్షాలు బాగున్నాయని చెప్పారు. ఆ నీళ్లు వరి పంటకు సరిపోతాయని తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటుచేసి.. సమస్యను పరిష్కరించాలని ప్రధానమంత్రిని కోరారు.