ఆ హీరోయిన్లంటే అసహ్యం
నటి ప్రణీత ఏదో ఒక వివాదంతో వార్తల్లో కెక్కే ప్రయత్నం చేస్తున్నట్లున్నారు. చాలా గ్యాప్ తరువాత కోలీవుడ్‌లో రీ ఎంట్రీ అయిన ఈ భామ ఇంతకుముందు కార్తీ సరసన శకుని చిత్రంలో నటించారు. ఆ చిత్రం ప్లాప్ అవడంతో ప్రణీత మూటాముల్లు సర్దుకుని టాలీవుడ్‌లో మకాం పెట్టారు. అక్కడ అత్తారింటికి దారేది చిత్రం ఆమెకు విజయాన్నిందించింది. ఆ చిత్ర దర్శకుడు తదుపరి చిత్రంలో కూడా అవకాశం ఇచ్చినా దీన్ని కాలదన్నుకున్నారు. అలాంటి సమయంలో తమిళంలో ఎమిజాక్సన్ వదులుకున్న సూర్య సరసన నటించే అవకాశం ప్రణీతకు వరించింది.
ఆ చిత్రం పేరు మాస్. ఇందులో ప్రధాన హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. కాగా చాలామంది హీరోయిన్లు విమాన ప్రయాణాల్లో బిజినెస్‌క్లాస్ టికెట్ కావాలి, షూటింగ్ స్పాట్‌లో క్యారవాన్ వ్యాన్ సౌకర్యాలు కావాలని డిమాండ్ చేస్తుంటారు. అయితే తను అలాంటి డిమాండ్లు చేయనంటున్నారు నటి ప్రణీత. ఇటీవల షూటింగ్ ముగించుకుని హైదరాబాదు నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఈ బ్యూటీ విమానంలో బిజినెస్ క్లాస్ టికెట్‌తో కాకుండా ఎకానమీ టికెట్‌తో ప్రయాణం చేశారట.
దీని గురించి ఆమె తెలుపుతూ విమానంలో పయనించడానికి బిజినెస్ క్లాస్ టికెట్టే కావాలని డిమాండ్ చేసే నటిని కానన్నారు. సూపర్‌స్టార్ మమ్ముట్టి, రాహుల్ ద్రావిడ్ లాంటి ప్రముఖులు కూడా ఎకానమీ టికెట్‌తోనే ప్రయాణం చేయడం చూశానన్నారు. అలాంటి ప్రయాణాల్లో అభిమానుల్ని కలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నారు. తాను ఎక్కువగా ఎకానమీ టికెట్‌తోనే పయనిస్తున్నానన్నారు. ఇలాంటి విషయాల్లో తానెప్పుడూ సంకటపడిన సందర్భాలు లేవన్నారు. అలాంటి విషయాల్లో బందా చూపే హీరోయిన్లంటే అసహ్యం అని ప్రణీత పేర్కొన్నారు.