
భార్యను హత్య చేసిన వ్యక్తి అరెస్టు
యలహంక: భార్యను హత్య చేసిన అనంతరం కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన వ్యక్తిని యలహంక పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మేరకు, మూడేళ్ల క్రితం బాగేపల్లి తాలూకా చేలూరుకు చెందిన మీనాక్షి(21)తో యలహంకకు చెందిన అశోక్‌కు వివాహమైంది. అశోక్ యలహంకలోని వెంకటాచలలో ఉన్న మంజునాథ్‌కు చెందిన తోటలో కూలి పనులు చేస్తూ తోటలోని చిన్నషెడ్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో మీనాక్షి మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానాలతో భార్యాభర్తల మధ్య గొడవ లు జరుగుతుండేవి.
మీనాక్షి తల్లి లక్ష్మీదేవమ్మ అప్పుడప్పుడు వచ్చి ఇద్దరికి నచ్చచెప్పి వెళుతుండేది. అయితే ఈ నెల 21న భార్యాభర్తల మధ్య గొడవ తీవ్రస్థాయికి చేరుకోవడంతో అశోక్, భార్య మీనాక్షిని కొడవలితో హత్య చేశాడు. అనంతరం అక్కడ గొయ్యి తవ్వి భార్య మృతదేహాన్ని పూడ్చివేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి ఇంట్లో భార్య కనిపించడం లేదని శుక్రవారం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య గురువారం సాయంత్రం నుంచి కనబడడం లేదని దయచేసి వెతికిపెట్టాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
మరుసటి రోజు పోలీసులు అశోక్‌ను తీసుకువచ్చి విచారించగా నేను తిరుపతికి వెళ్లానని తాను తిరిగి వచ్చేలోగా మీనాక్షి వెళ్లిపోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఇతని మాటలపై అనుమానం వచ్చిన ఎస్‌ఐ విచారణ ముమ్మరం చేశారు. శుక్రవారం ఇంటి నుంచి దర్జాగా తిరుగుతూ వస్తుండడాన్ని గమనించిన పోలీసులు అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి తమదైనశైలిలో విచారించడంతో అశోక్ హత్య విషయం బయటపెట్టాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.