70 మేనిఫెస్టోలు | Will prepare poll manifestos for each of Delhi's 70 Assemby | Sakshi
Sakshi News home page

70 మేనిఫెస్టోలు

Published Mon, Oct 21 2013 1:57 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

Will prepare poll manifestos for each of Delhi's 70 Assemby

న్యూఢిల్లీ: ఆరంభం నుంచి ప్రతి అడుగులోనూ ప్రత్యేకతను కనబరుస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) మేనిఫెస్టోల రూపకల్పనలో కూడా తనదైన ప్రత్యేకతను చాటుతోంది. డిసెంబర్ 4న జరగనున్న విధానసభ ఎన్నికల్లో 70 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న ఏఏపీ ఎన్నికల్లో గెలిస్తే తామేమి చేస్తామో చెప్పేందుకు 71 మేనిఫెస్టోలను రూపొందిస్తోంది. ఢిల్లీ మొత్తానికి కలిపి ఓ ఉమ్మడి(కామన్) మేనిఫెస్టోతోపాటు నియోజకవర్గానికో మేనిఫెస్టో చొప్పున మొత్తం 71 మేనిఫెస్టోలను తయారు చేసే పనిలో ఆ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు.
 
 ఈ విషయమై ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు మాట్లాడుతూ... ‘నగరాన్ని మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దడం, నాణ్యమైన విద్యను అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో  మౌలిక వసతులు మెరుగుపర్చడం, వైద్యం భారం ప్రజలపై పడకుండా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించడం, ప్రతి ఇంటికి రోజుకు 700 లీటర్ల మంచినీటిని ఉచితంగా సరఫరా చేయడం, విద్యుత్ బిల్లులను తగ్గించడం వంటివి కామన్ మేనిఫెస్టోలో ఉంటాయి. ఇవి కాకుండా నగరంలోని 70 నియోజకవర్గాల్లో ప్రజలు రకరకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. గడప గడపకు తిరిగి సమస్యలేమిటో తెలుసుకొని, వాటిని స్థానిక మేనిఫెస్టోలో పొందుపరుస్తాం. అలా నియోజకవర్గానికో మేనిఫెస్టో చొప్పున మొత్తం 70 మేనిఫెస్టోలను తయారు చేస్తాం. ప్రస్తుతం మా పార్టీ కార్యకర్తలు ఇదే పనిలో ఉన్నారు. 
 
 చాలా ప్రాంతాల్లో నీటి కొరత సమస్య అధికంగా ఉన్నట్లు గుర్తించాం. అందుకే కామన్ మేనిఫెస్టోలో దీనికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలని నిర్ణయించామ’ని చెప్పారు. మిగతా పార్టీలు ప్రజా సమస్యలను పక్కనబెట్టి మేనిఫెస్టోలను రూపొందిస్తున్నాయని, ఆ మార్గంలో తాము పయనించాలనుకోవడం లేదన్నారు. ఆరంభం నుంచి ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్న ఏఏపీ అదే లక్ష్యంతో ఎన్నికలకు వెళ్తుందన్నారు. అందుకే స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న చిన్న చిన్న సమస్యలను కూడా వదిలిపెట్టరాదనే ఉద్దేశంతోనే మొత్తం 70 మేనిఫెస్టోలతో ఎన్నికలకు వెళ్తామన్నారు. ఇప్పటికే సగానికిపైగా నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలు తిరిగి సమస్యలేమిటో తెలుసుకున్నారని, వాటి ఆధారంగా మేనిఫెస్టోలు తయారు చేస్తున్నారని, వీటిపై పార్టీలో చర్చ జరిగిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు మేనిఫెస్టోల్లో ఉన్నప్పుడే వాటి పరిష్కారం కోసం పోరాడే పార్టీలకు వారు అండగా నిలుస్తారన్నారు.
 
  పది, పదిహేను రోజుల్లో 90 శాతం మంది ఓటర్ల మద్దతు కూడగడతామని తమ అధినేత చెప్పినప్పుడు... అది ఎలా సాధ్యమంటూ ప్రతిపక్షాలు ప్రశ్నించాయని, మేనిఫెస్టోల ద్వారా ప్రజలకు చేరువ కావడం తమ వ్యూహాల్లో ఒకటన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాల ద్వారా నగరవాసులకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement