‘ఆప్’ ర్యాలీపై ఈసీ నజర్
Published Sun, Nov 10 2013 11:13 PM | Last Updated on Wed, Oct 17 2018 3:46 PM
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీలైనంత ఎక్కువమంది ఢిల్లీవాసులను కలుసుకోవాలనే ధ్యేయంతో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం మొదలుపెట్టిన ‘జాడూ చలావో యాత్ర’పై రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టింది. ఈ యాత్ర సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఆ పార్టీ ఉల్లంఘించినట్లు కమిషన్ గుర్తించింది. ఢిల్లీ విధాన సభకు సమీపంలోని సివిల్ లైన్స్ ఏరియాలో ఉన్న ఓల్డ్ చంద్రవాల్ నుంచి ఆదివారం ఉదయం 11 గంటలకు 22 రోజుల యాత్ర(రోడ్ షో)ను కేజ్రీవాల్ ప్రారంభించారు. అనంతరం యాత్రలో అనుమతి కన్నా ఎక్కువ వాహనాలు ఉపయోగిస్తున్నారని చాందినీ చౌక్ వద్ద ఎన్నికల కమిషన్ పరిశీలకులు యాత్రను నిలిపివేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక ర్యాలీలో 10 కన్నా ఎక్కువ వాహనాలను వినియోగించరాదు. దాంతో ర్యాలీలో ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించేలా కేజ్రీవాల్ తన మద్దతుదారులను కోరారు.
అనంతరం ర్యాలీ విధాన్ సభ, తీస్‌హజారీ, బర్ఫ్‌ఖానా, చాందినీ చౌక్, రెడ్ ఫోర్ట్, జామా మసీద్, మాటియా మహల్ మీదుగా నాలుగు గంటల పాటు సాగింది. కోడ్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు కేజ్రీవాల్ తన ర్యాలీని నిలిపివేశారు. దీంతో ఆయన బల్లిమరన్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించలేకపోయారు. ఈ సందర్భంగా, డిసెంబర్ నాలుగు ఎన్నికల నేపథ్యంలో స్థానికులను కలిసి తమ పార్టీని ఆదరించాలని కేజ్రీవాల్ కోరారు. ఇదిలా ఉండగా, ఈ రోడ్ షో సందర్భంగా నగరంలోని 70 నియోజకవర్గాల్లోనూ పర్యటించి, స్థానికులు సమస్యలు తెలుసుకుని, పరిష్కారాలపై చర్చించాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఈ యాత్ర డిసెంబర్ ఒకటో తేదీకి ముగుస్తుందన్నారు. కాగా, జిల్లా ఎన్నికల అధికారి(కేంద్ర) ఆషిమా జైన్ మాట్లాడుతూ ర్యాలీకి సంబంధించి మొత్తం వీడియో తీశామన్నారు. దీనిపై రెండు రోజుల్లో నివేదిక తయారుచేస్తామని చెప్పారు.
Advertisement
Advertisement