
‘ఎబోలా’ భయం
సాక్షి, చెన్నై:ఆధునిక యుగంలో సరికొత్త రోగాలు ప్రజలను వణికిస్తున్నాయి. గతంలో చికున్ గున్యా, స్వైన్ ఫ్లూ ప్రజల్ని భయ కంపితుల్ని చేశాయి. తాజాగా ఎబోలా ప్రజల్లో కలకలాన్ని రేపుతోంది. రెండు రోజుల క్రితంఆఫ్రికా ఖండంలోని గినియూ నుంచి చెన్నైకు వచ్చిన తేని యువకుడు జ్వరం బారిన పడ్డట్టు వైద్యులు గుర్తించారు. దీంతోప్రజల్లో ఎబోలా భయం పట్టుకుంది. ఆ జ్వరం తీవ్రత గురించి పత్రికల్లో, మీడియాల్లో వస్తున్న కథనాలు, దక్షిణాఫ్రికాలో ఆ తీవ్రతతో చోటు చేసుకుంటున్న మరణాలు వెరసి ప్రజల్లో తెలియని భయాన్ని సృష్టిస్తున్నాయి.
అబ్జర్వేషన్‌లో పార్తిబన్: జ్వరంతో గినియూ నుంచి వచ్చిన పార్తిబన్‌కు అన్ని వైద్య పరీక్షలు చేశారు. అయితే, అతడి రక్త నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ప్రస్తుతం జ్వరం తీవ్రత తగ్గి, ఆరోగ్యంగా ఉన్నాడు. స్వగ్రామానికి సైతం అతడిని పంపించారు. అయినా, అధికారుల్లో తెలియని భయం వెంటాడుతోంది. దీంతో అతడిని తమ అబ్జర్వేషన్లో ఉంచుకున్నారు. అతడి స్వగ్రామంలోనే ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా వైద్య బృందాన్ని రంగంలోకి దించారు. 21 రోజుల పాటుగా ఈ వైద్య బృందం అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ, మళ్లీ జ్వరం బారిన పడకుండా చర్యలు తీసుకోవడం కాస్త ప్రజల్లో మరింత ఆందోళనను రేకెత్తిస్తున్నది. ఈ విషయమై పార్తిబన్‌కు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ శివగామి పేర్కొంటూ, అతడికి ఎలాంటి జ్వరం లేదని స్పష్టం చేశారు. అయితే, ఏదేని జ్వరం తీవ్రతకు మళ్లీ గురైన పక్షంలో, మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని, అందుకే తాము అతడిని అబ్జర్వేషన్లో ఉంచామని వివరించారు.
మరో ముగ్గురికి : పార్తిబన్‌కు తోడు మరో ముగ్గురు దక్షిణాఫ్రికా నుంచి రాష్ర్టంలోకి వచ్చినట్టు తేలింది. ఆదివారం దుబాయ్ నుంచి మదురైకు వచ్చిన ఓ విమానంలో ముగ్గురు దక్షిణాఫ్రికాలోని గానా నగరం నుంచి కొడెకైనాల్‌కు వచ్చినట్టు గుర్తించారు. ఎట్టకేలకు వీరిని మంగళవారం గుర్తించారు. డలో డైవాన్ అమ్మి(45), డివెన్స్ స్ట్రీ(6), ఆండ్రినియ(3)గా వారిని గుర్తించి, వైద్య పరీక్షలు చేశారు. డైవాన్ గతంలో కొడెకైనాల్‌లోని ఓ కళాశాలలో చదువుకుని గానాలో స్థిర పడ్డారు. ఓ కార్యక్రమం నిమిత్తం కొడెకైనాల్‌కు వచ్చారు. వారికి వైద్య పరీక్షలు పూర్తి చేసినాననంతరం, ఆరోగ్యంగానే ఉన్నట్టు నిర్ధారించారు. ఆఫ్రికా ఖండం నుంచి దుబాయ్, సౌదీల మీదుగా చెన్నైకు వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉన్నట్టుగా విమానాశ్రయ వర్గాల పరిశీలనలో తేలింది.
దీంతో రాష్ట్రంలోని చెన్నై, మదురై, కోయంబత్తూరు విమానాశ్రయాల్లోని విదేశీ టెర్మినల్స్ వద్ద ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇద్దరు వైద్యాధికారుల నేతృత్వంలో, కస్టమ్స్, విమానాశ్రయాల అధికారులతో ఏర్పాటు చేసిన ఈ బృందం విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల్ని క్షుణ్ణంగా పరిశీలించనుంది. వారి పాస్‌పోర్టుల ఆధారంగా ఎక్కడి నుంచి వస్తున్నారో గుర్తించి, అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. కోయంబత్తూరు, మదురై, చె న్నై ప్రభుత్వాస్పత్రుల్లో ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఎబోలా రాష్ట్రంలో లేదని, అయినా, ముందు జాగ్రత్త చర్యగా ఏర్పాట్లు చేశామని ఆరోగ్య శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఇదే మాదిరిగా రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ లేదంటూ తొలుత తేల్చినా, అనంతరం ఆ ఫ్లూ విలయతాండవంతో ప్రజలు భయం గుప్పెట్లో ముందస్తు టీకాలు వేసుకోవాల్సి రావడం గమనార్హం.