నేనూ అరవగలను
కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ ఆగ్రహం
బెంగళూరు : ‘అరవడం మీకే కాదు.. నాకూ వచ్చు. సభలో గొడవ చేయకుండా ఊరికే ఉండండి’ అంటూ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులతో పాటు పార్టీ చీఫ్ విప్ తీరుపై స్పీకర్ కాగోడు తిమ్మప్ప మండిపడ్డారు. గురువారం ఉదయం శాసనసభ కార్యకలాపాలు ప్రారంభం కాగానే... ‘సెల్’ వీక్షణతో మీడియా కంట పడిన ఎమ్మెల్యే ప్రభుచౌహాన్ తీరును విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు చీఫ్ విప్ కూడా వెల్‌లోకి దూసుకెళ్లారు. వెల్‌లోకి వచ్చిన సభ్యులను తిరిగి వారి స్థానాల్లోకి వెళ్లిపోవాల్సిందిగా స్పీకర్ కాగోడు తిమ్మప్ప సూచించారు. అయినా అధికార పార్టీ ఎమ్మల్యేల తీరులో ఎలాంటి మార్పు కనిపించకపోవడంతో స్పీకర్ సహనం కోల్పోయారు. ‘అరవడం మీకే కాదు నాకూ వచ్చు’ అని గద్దించడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మౌనం వహించాల్సి వచ్చింది.
ఇక అనంతరం అధికార పక్ష చీఫ్ విప్ పై కూడా స్పీకర్ కాగోడు తిమ్మప్ప మండిపడ్డారు. ‘సభా కార్యకలాపాల విషయంలో ఎమ్మెల్యేలకు మార్గదర్శిగా వ్యవహరించాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న మీరు కూడా ఇలా ప్రవర్తించడం ఏ మాత్రం సరికాదు’ అని అనడంతో ప్రభుత్వ చీఫ్ విప్ పీఎం అశోక్ కూడా మౌనంగా తన స్థానంలోకి వెళ్లిపోయారు. ఆ వెంటనే మళ్లీ చిరునవ్వుతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభా కార్యకలాపాలు కొనసాగించడం గమనార్హం.