
సేలం (తమిళనాడు): తమిళనాడు నీలగిరి జిల్లాలో ఒక చిరుత పులి ఓ ఇంటిలోకి చొరబడి గ్రామస్తులను పరుగులు పెట్టించింది. నీలగిరి జిల్లా పందలూరు తాలూకా సమీపంలో కొండ గ్రామం కైవట్టాకి చెందిన రైతు రాయిన్ తోటలో పనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో మంచం కింద ఏదో చప్పుడు వినిపించింది. కిందికి చూడగా చిరుత పులి కనిపించింది. దీంతో రాయిన్ అతని భార్య భయంతో బయటకు పరుగులు తీసి ఇంటికి తాళం వేశారు.
ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో చిరుతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అనంతరం అటవీ శాఖ అధికారులు కూడా రాయిన్ ఇంటి వద్దకు చేరుకున్నారు. చిరుతపులికి మత్తు ఇచ్చి లేదా వల వేసి పట్టుకోవాల్సి ఉందని వారు పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కావడంతో బుధవారం ఉదయం చిరుత ను పట్టుకుంటామని తెలిపారు.