
సాక్షి, చెన్నై : మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయనేందుకు పరాకాష్టగా తమిళనాడులో చోటుచేసుకున్న ఈ ఉదంతం నిలిచిపోతుంది. బస్సులో ప్రయాణిస్తూ తుదిశ్వాస విడిచిన ఓ వ్యక్తిని డ్రైవర్, కండక్టర్ ఏ మాత్రం కనికరం లేకుండా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లడం అందరినీ నివ్వెరపరుస్తోంది. తమిళనాడులోని సూళగిరి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. తిరుకోయిలూరు సమీపంలోని కనకనందం గ్రామానికి చెందిన వీరన్ (54), రాధాకృష్ణన్ (44) బెంగళూర్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు.
వీరు స్వగ్రామానికి వెళ్లేందుకు తమిళనాడు ఆర్టీసీ బస్సులో బుధవారం ఉదయం బయలుదేరారు. సూళగిరి సమీపంలో వీరన్ ఆకస్మాత్తుగా మరణించాడు. దీంతో డ్రైవర్, కండక్టర్ జాతీయ రహదారిపై వీరన్ మృతదేహాన్ని దించి వెళ్లిపోయారు. దిక్కుతోచని మిత్రడు రాధాకృష్ణన్ స్ధానిక పోలీసులకు సమాచారం అందించాడు. డ్రైవర్, కండక్టర్లు నిర్ధయగా వ్యవహరించి నడిరోడ్డుపై శవాన్ని వదిలి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశాడు.
అంబులెన్స్ కోసం పడిగాపులు పడుతున్నానని చెప్పుకొచ్చాడు. ఇంతలో ఘటనా స్థలానికి చేరుకున్న సూళగిరి పోలీసులు వీరన్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి బంధువులకు సమాచారం అందచేశారు.
Comments
Please login to add a commentAdd a comment